Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అబ్బురపడిన అమెరికా చేనేత నిపుణురాలు
నవతెలంగాణ - సిరిసిల్ల
సిరిసిల్ల నేతన్నల నైపుణ్యానికి అమెరికా చేనేత నిపుణురాలు అబ్బురపడ్డారు. అమెరికాకు చెందిన చేనేత నైపుణ్య నిపుణురాలు క్యారా జాఫ్ సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటించారు. అమెరికా ప్రభుత్వ పరిశోధన గ్రాండ్తో ఆసియా ఖండంలోని వివిధ దేశాల్లో చేనేత పరిస్థితులు.. నైపుణ్యం వంటి అంశాలపై సమగ్రమైన అధ్యయనం చేస్తున్న కైరా సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఇప్పటికే పలు దేశాల్లో ఉన్న పరిస్థితులపైన ముఖ్యంగా అక్కడి చేనేత పరిశ్రమపై ఆమె అధ్యయనాన్ని పూర్తిచేసుకున్నారు. భారత దేశంలో తెలంగాణతోపాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో తన అధ్యయనాన్ని కొనసాగించనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని చేనేత కార్మిక క్షేత్రాలైన పోచంపల్లి, గద్వాల్, ఎన్ఎస్ సిరిసిల్ల, సిద్దిపేట, జనగామ వంటి ప్రాంతాల్లో పర్యటించనున్నారు. సిరిసిల్ల పట్టణంలో ఉన్న పలువురు చేనేత కార్మికుల మగ్గాలను, నేస్తున్న బట్టలను, వారి చేనేత నైపుణ్యాలకు సంబంధించిన అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. చేనేత కళ నుంచి మరమగ్గాలవైపు సిరిసిల్ల నేతన్నలు మళ్లిన చారిత్రాత్మక క్రమంపై కూడా ఆమె వివరాలు సేకరించారు. అనంతరం వినూత్నమైన చేనేత ఉత్పత్తులతో దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చిన హరిప్రసాద్‌ను కలిశారు. ఆయన రూపొందించిన వివిధ చేనేత ఉత్పత్తులను ముఖ్యంగా అగ్గిపెట్టెలో పట్టేలా నేసిన చీరను చూసి ఆమె అబ్బురపడ్డారు. అద్భుతమైన ప్రతిభానైపుణ్యం కలిగిన చేనేత కార్మికులను ఇంతవరకు తాను చూడలేదని చెప్పారు. సిరిసిల్ల పట్టణంలో ఉన్న చేనేత కార్మికుల నైపుణ్యంతోపాటు ఒక పవర్ లూమ్ క్లస్టర్‌గా మారిన తీరుపట్ల హర్షం వ్యక్తం చేశారు. సంక్షోభం నుంచి, నేతన్నలు స్వయం సమృద్ధివైపు సాగుతుండటాన్ని పరిశీలించారు. ఈ క్షేత్ర పరిశీలనలో ఆమె వెంట తెలంగాణ మరమగ్గాలు, జౌళి అభివృద్ధి కార్పొరేషన్ అధ్యక్షులు గూడూరి ప్రవీణ్, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ తదితరులు ఉన్నారు.