Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారుల ఎదుటే యువరైతు ఆత్మహత్య
- సెల్‌టవర్ ఎక్కి ఉరేసుకొని బలవన్మరణం
- చెరువు నీళ్లు వస్తుండటంతో పంట నష్టపోతుందని మనస్తాపం
నవతెలంగాణ-లింగంపేట్
రైతు గోడు పట్టించుకునే వాడే కరువైయ్యాడు. చెరువు కాలువలో నుంచి వెళ్తున్న నీటితో ప్రతేడాదీ తన పంట నీటమునిగి నష్టం వాటిల్లు తుందని, నీరు రాకుండా చర్యలు తీసుకో వాలన్న ఆ యువరైతు ఆవేద నను ఎవరూ పట్టించుకోలేదు. నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించాలని వేడుకున్నా.. వినిపిం చుకునే వారు లేకపోయారు. అధికారుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి విసిగి వేసారి.. తీవ్ర మనస్తాపంతో అధికారుల ఎదుటే సెల్‌టవర్ ఎక్కి అందరూ చూస్తుండగానే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ హృదయ విదారక ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం మెంగారం గ్రామంలో సోమవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మెంగారం గ్రామానికి చెందిన పుట్ట ఆంజనేయులు (32) తన సొంత పొలంలో నుంచి గ్రామ సమీపంలోని ఊర చెరువు కాలువ నీళ్లు పోతుండటంతో తీవ్రంగా నష్టపోతున్నాడు. కొన్నేండ్లుగా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చారు. తన పంటపొలం నుంచి చెరువు నీళ్లు వెళ్లకుండా పనులు చేపట్టాలని, నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించాలని వేడుకున్నాడు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ప్రతేడాదీ విన్నవించుకున్నా తన సమస్యను మాత్రం పట్టించుకోవడం లేదని తీవ్ర ఆవేదనకు గురైయ్యాడు. తాజాగా ఆదివారం చెరువు నీటి ఆయకట్టుపై తైబంది నిర్వహించారు. చెరువులో ఉన్న నీటితో 60 ఎకరాలు సాగు చేయొచ్చని, కాలువను శుభ్రం చేసేందుకు రైతుల నుంచి ఎకరాకు రూ.500 వసూలు చేస్తున్నారు. కాలువను మరింత తవ్వితే తన పంట పూర్తిగా మునిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. తన గోడును ఎవరూ పట్టించుకోవడం లేదని, ఉన్న 20 గుంటల భూమిలో సాగు చేసుకుంటున్నా చెరువు నీటితో నష్టం వాటిల్లుతుందని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దాంతో సోమవారం గ్రామంలో ఉన్న సెల్‌ఫోన్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. దాంతో రెండు గంటల పాటు ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు, పోలీసులు, డీఎస్పీ, ఆర్డీవో అక్కడికి చేరుకొని రైతుకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తీవ్ర మనస్థాపానికి గురై అధికారుల, పోలీసుల ఎదుటనే సెల్‌టవర్‌పై ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. అధికారుల, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం పోయిందని గ్రామస్తులు ఆవేదన చెందారు. మృతునికి భార్య సుజాత, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.