Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యామంత్రి సబితకు టీపీజేఎంఏ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించే గడువును ఆలస్య రుసుం లేకుండా 15 రోజులు పొడిగించాలని తెలంగాణ ప్రయివేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాల సంఘం (టీపీజేఎంఏ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని సోమవారం హైదరాబాద్లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరి సతీశ్ నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో జూనియర్ కాలేజీల్లో ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థుల్లో 30 నుంచి 40 శాతం వరకు ఫీజును చెల్లించలేదని తెలిపారు. ఆర్థిక, ఇతర వ్యక్తిగత కారణాలతో కట్టలేదని పేర్కొన్నారు. అయితే వంద రూపాయల ఆలస్య రుసుంతో చెల్లించే అవకాశాన్ని ఇంటర్ బోర్డు కల్పించడం సరైంది కాదని తెలిపారు. ఆలస్య రుసుం లేకుండానే మంత్రి సానుకూలంగా స్పందించారనీ, పరీక్ష ఫీజు గడువును పెంచుతామంటూ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. జూనియర్ కాలేజీలకు అనుబంధ గుర్తింపును 2023-24 విద్యాసంవత్సరం నుంచి ఒకటి, మూడు, ఐదేండ్ల వరకు పెంచాలంటూ నోటిఫికేషన్ జారీ చేయాలన్న విజ్ఞప్తిపై మంత్రి స్పందిస్తూ విద్యాశాఖ కార్యదర్శితో సంప్రదిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీజేఎంఎ ఉపాధ్యక్షులు పార్థసారధి, హైదరాబాద్ నాయకులు ఉస్మాన్అలీ, హైదర్, రుక్మాన్ తదితరులు పాల్గొన్నారు.