Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు బీజేపీ కుట్రలు : ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు
నవ తెలంగాణ-హుస్నాబాద్ రూరల్
గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తిచేసి హుస్నాబాద్ ప్రాంత రైతుల కన్నీళ్లు తుడుస్తామని వైద్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మిర్జాపూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించారు. జిల్లాలగడ్డలో గ్రామ పంచాయతీ భవనం, మహిళా బిల్డింగ్ ప్రారంభించారు. మహమ్మదాపూర్ గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని బీజేపీ అడుగడుగునా అడ్డుకునేందుకు కుట్రలు చేస్తోందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి ప్రత్యేక రాష్ట్రం వస్తే తెలంగాణలో కరెంటు ఉండదన్నారు. సాధించుకున్న తెలంగాణలో 24 గంటల కరెంటు మనకొచ్చిందని, కిరణ్ కుమార్ రెడ్డి జీవితం మాత్రం చీకటి అయ్యిందన్నారు. తెలంగాణలో మిషన్ భగీరథతో ఇంటింటికి తాగునీటిని అందిస్తున్నామన్నారు. సాధించుకున్న తెలంగాణలో 1.50 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 9 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైందన్నారు. తెలంగాణలో రకరకాల ముసుగుల్లో బాణాలు ఎక్కు పెడుతూ ఆంధ్ర పార్టీలు వస్తున్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇయ్యకుండా ఉద్యోగాలు రాకుండా చేసింది బీజేపీ అన్నారు. సీఎం కేసీఆర్ లేకపోతే నిధులు, నియామకాలు, రైతుబంధు దక్కునా అన్నారు. రైతుల బాయిలకు మీటర్లు పెట్టాలని కేంద్ర ఆర్థిక శాఖ మన రాష్ట్రంలోని ఆర్థిక శాఖకు ఉత్తరం రాసిందన్నారు. బీజేపీ నరేంద్ర మోడీ రైతుల బాయిలకాడ మీటర్ పెడితే రూ.600 కోట్లు ఇస్తారట.. అందుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పు కోలేదని తెలిపారు. కరోనా కష్టకాలంలో అన్నీ బందుపెట్టి రైతుల కోసం రైతుబంధు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల చొప్పున నేటికీ 16 కోట్లు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. మహ్మదాపూర్‌లోని మహాచండీ అమ్మవారికి రూ.పది లక్షల కేటాయించినట్టు తెలిపారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 15 రోజుల్లో ఖాతాల్లో వేస్తామని చెప్పారు. కార్యక్రమంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్, జెడ్పీ చైర్మెన్ రోజాశర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా పరిషత్ రాజారెడ్డి, మున్సిపల్ చైర్మెన్ ఆకుల రజిత వెంకన్న, ఎంపీపీ మానస, అక్కన్నపేట ఎంపీపీ లక్ష్మి, జెడ్పీటీసీ మంగ, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు వంగ వెంకట్రాంరెడ్డి, సర్పంచులు లతా మహేందర్, పిట్టల సంపత్ ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.