Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలిరోజు భారీ ప్రదర్శన, బహిరంగసభ
- ముఖ్యఅతిధిగా కేరళ సీఎం పినరయి విజయన్
- హాజరు కానున్న తమ్మినేని, బి వెంకట్
- పోస్టర్ ఆవిష్కరించిన నాయకులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (వ్యకాస) రాష్ట్ర మహాసభలను ఈనెల 29, 30, 31 తేదీల్లో ఖమ్మంలో నిర్వహించనున్నారు. తొలిరోజు (29న) ఖమ్మంలో భారీ ప్రదర్శన అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ మహాసభలకు ముఖ్య అతిధులుగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, వ్యకాస రాష్ట్ర ఉపాధ్యక్షులు తమ్మినేని వీరభద్రం, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్ హాజరు కానున్నారు. సంబంధిత పోస్టర్‌ను సోమవారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య, ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ కూలీల హక్కుల కోసం ఈనెల 29న జరిగే ప్రదర్శన, బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రామీణ ప్రాంత పేదలకు అనేక హామీలను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. వాటిని నెరవేస్తుందనే నమ్మకంతో ఇప్పటికీ పేదలున్నారని చెప్పారు. కానీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై రాష్ట్రప్రభుత్వం కప్ప దాటుడుగా వ్యవహరిస్తున్నదని అన్నారు. తోట సాగుదార్లకు హక్కు పట్టాలివ్వాలనీ, దళితులకు మూడెకరాల సాగుభూమి పంపిణీ చేయాలనీ, డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేయాలని కోరారు. పింఛన్‌దార్లు, దళిత బంధు లబ్దిదారులను ఎంపిక చేయాలనీ, తెల్ల రేషన్ కార్డులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పనికి సంబంధించి అనుసరిస్తున్న పద్ధతుల్లో గందరగోళం నెలకొన్నదని విమర్శించారు. ఈ ఎనిమిదేండ్ల కాలంలో కనీస వేతనాల జీవోను సవరించి పెంచలేదన్నారు. భూసేకరణ జరిగే ప్రాంతాల వద్ద నిర్వాసితులవుతున్న వ్యవసాయ కార్మికులు, వృత్తిదారులకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యా, వైద్యం, ప్రజా పంపిణీ వ్యవస్థను నీరుగారుస్తున్నారని విమర్శించారు. మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను పరిష్కరించడంలో పట్టీ పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఈ అంశాలను మహాసభలో చర్చిస్తామనీ, భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యకాస రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్, బొప్పన పద్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు రాగిరి ఆంజనేయులు పాల్గొన్నారు.