Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్, బీజేపీ కుట్ర రాజకీయాలు
- కవిత, బీఎల్ సంతోష్ విచారణకు ఎందుకు హాజరుకావడం లేదు
- మోడీ రాష్ట్రాన్ని అక్రమించాలని చూస్తుండు..
- కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతాం: టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి
- ధరణి సమస్యలు పరిష్కరించాలని వికారాబాద్ కలెక్టరేట్ ముట్టడి
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
ఢిల్లీలో లిక్కర్ స్కాం, గల్లీలో ఎమ్మెల్యేల కొనుగోళ్లు అంటూ బీజేపీ, టీఆర్ఎస్లు కుట్ర చేసి ప్రజా సమస్యలను పక్కాదారి పట్టిస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి టీఆర్ఎస్, బీజేపీలపై విరుచుకుపడ్డారు. ఎనిమిదేండ్లు కలిసి ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు డ్రామాలు చేస్తున్నాయని, లిక్కర్ స్కాంలో ఉన్న వారిని జైల్లో పెట్టాలని, ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు తమపై వచ్చిన ఆరోపణలపై విచారణకు హాజరై దర్యాప్తు సంస్థలకు సహకరించారని, కానీ కవిత, బీఎల్ సంతోష్ ఎందుకు హాజరుకావడం లేదంటూ ప్రశ్నించారు. ధరణి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కలెక్టరేట్ ముట్టడికి యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాంతో పోలీసులు, పార్టీ శ్రేణుల మధ్య తోపులాట ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ శ్రేణులు భారీగా తరలిరావడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఉద్యమ సమయంలో మన యాస, భాషపై దాడి జరుగుతుందన్నారని, కానీ ఇప్పుడు మన బతుకులపై దాడి జరుగుతోందన్నారు. మన కల్చర్ అగ్రికల్చర్ అని, అలాంటి అగ్రికల్చర్‌ను కార్పొరేట్‌కు కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ధరణి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖతంలో కలుపుతామని ప్రకటించారు. రైతులను కూలీలుగా మార్చాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రైతుబీమా ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్ పంట నష్టానికి బీమా ఎందుకివ్వడం లేదని ఆరోపించారు. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేల కొనుగోలు చేసిన కేసీఆర్ ఇప్పుడు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2015లో అన్యాయంగా తనను జైల్లో పెట్టారని, తన కూతురు పెళ్లికి పోకుండా చేయాలని కేసీఆర్ కుట్ర చేశారని ఆరోపించారు. తమను మింగిన పాపం ఊరికే పోదని, ఇవాళ తన బిడ్డ ఇంటికి సీబీఐ వచ్చిందన్నారు. గోదావరి జలాలు రంగారెడ్డి జిల్లాకు రాకుండా అడ్డుకున్నది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక ప్రతి రైతుకూ రూ.2లక్షలు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ధర్నాలో కాంగ్రెస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు టి.రామ్మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్, వికారాబాద్ పట్టణ పట్టణ అధ్యక్షులు సుధాకర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు రఘువీర్ రెడ్డి, అధిక సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు, రైతులు పాల్గొన్నారు.