Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఖిలభారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
వీఎన్ స్ఫూర్తితో పాలకులు అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని అఖిలభారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం తెలంగాణ సాయుధ పోరాటయోధులు మల్లు వెంకటనర్సింహారెడ్డి 18వ వర్ధంతిని పురస్కరిం చుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీలక్ష్మీ ఫంక్షన్ హాల్లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో 'బీజేపీ ప్రభుత్వ విధానాలు- వ్యవసాయ రంగంపై ప్రభావం'' అంశంపై నిర్వహించిన సెమినార్లో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకొచ్చిన ఎనిమిదేండ్ల కాలంలో రైతాంగానికి ఎలాంటి మేలూ చేయలేదని విమర్శించారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ వ్యవసాయరంగాన్ని వారి చేతుల్లో పెట్టేందుకు యత్నిస్తోందన్నారు. దాంతో సాగు రంగం రోజు రోజుకూ దివాళా తీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎరువులు, క్రిమీసంహారక మందుల ధరలు ఇష్టమొచ్చినట్టు పెంచి రైతుల నడ్డి విరుస్తోందని విమర్శించారు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయడంలో కేంద్రం విఫలమైందన్నారు. రైతు పండించిన అన్ని రకాల పంటలకు మార్కెట్ సౌకర్యం కల్పించి, గిట్టుబాటు ధరకు పంటలను కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. కల్తీ విత్తనాలు, కల్తీ పురుగుల మందులను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేవలం ఒక్క శాతం మాత్రమే నిధులు కేటాయిస్తున్నారన్నారు. రుణమాఫీని ఏకకాలంలో అమలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. రైతాంగానికి బ్యాంకు ద్వారా నూటికి 18 రూపాయలు రుణాలు ఇవ్వాల్సి ఉందని, ఆ నిబం ధనను బ్యాంకులు అమలు చేయడం లేదన్నారు. రాష్ట్రంలో అప్పుల బాధతో సంవత్సరానికి సుమారు 640 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మరో 750 మంది విద్యుత్‌షాక్‌తో చనిపోతున్నారని చెప్పారు. సాదా బైనామాల కోసం రాష్ట్రంలో 12 లక్షలు మంది రైతులు దరఖాస్తు చేసుకుంటే.. రెండు లక్షల మంది రైతులకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చిందన్నారు. అంతకు ముందు మల్లు వెంకటనర్సింహారెడ్డి చిత్రపటానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్లో జిల్లా కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, నెమ్మాది వెంకటేశ్వర్లు, బుర్రి శ్రీరాములు, మట్టిపల్లి సైదులు, ఎలుగూరిగోవింద్, మేదరమెట్ల వెంకటేశ్వర్రావు, పారేపల్లి శేఖర్‌రావు, దండ వెంకటరెడ్డి, జిల్లాపల్లి నర్సింహారావు, ధనియాకుల శ్రీకాంత్‌వర్మ, మేకనపోయిన సైదమ్మ, మద్దెలజ్యోతి తదితరులు పాల్గొన్నారు.