Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి
- రాష్ట్ర వ్యాప్తంగా పీహెచ్‌సీల ఎదుట ధర్నా
నవతెలంగాణ- విలేకరులు
పనిభారం తగ్గించాలని, కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేశారు. పీహెచ్‌సీల ఎదుట నిరసన తెలిపి.. వైద్యాధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఖమ్మం జిల్లా వైరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ఆశా కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని వైద్యాధికారి సుచరితకు అందజేశారు. ఎర్రుపాలెం, మధిర, బోనకల్ మండలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఎదుట ధర్నా నిర్వహించి, వినతిపత్రాన్ని మండల వైద్యాధికారులకు అందజేశారు. ముందుగా సీఐటీయూ కార్యాలయం నుంచి ర్యాలీగా ఆస్పత్రి వరకు చేరుకున్నారు. దుమ్ముగూడెం, ములకలపల్లిలో ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహించి వైద్యాధికారి వినతిపత్రం అందజేశారు.
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశావర్కర్లు నిరసన తెలిపారు. గండిపేట, మియాపూర్, రాజేంద్రనగర్, శంషాబాద్ మండల కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఎదుట ఆందోళన చేశారు. తమకు పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు సోమవారం ఆశా వర్కర్లు సీఐటీయూ కార్యదర్శి జోషి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం సూపర్వైజర్ సుజాతకు వినతిపత్రం అందజేశారు. ఆశా కార్యకర్తలకు కనీస వేతనం రూ. 26వేలు చెల్లించి, పనిభారం తగ్గించాలని సీఐటీయూ వనపర్తి జిల్లా జిల్లా సహాయ కార్యదర్శి సూర్యవంశం రాము అన్నారు. పాన్‌గల్ మండలం కేంద్రంలోని పిహెచ్సి దగ్గర ధర్నా నిర్వహించారు. అనంతరం పీహెచ్సీ డాక్టర్ రాజశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఆశా వర్కర్లకు అదనపు పనికి అదనపు వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం పీహెచ్సీలలో వినతిపత్రాలు అందించారు. కుమురంభీం-ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్, భట్టుపెల్లి, నజ్రుల్‌నగర్ పీహెచ్సీ, కాగజ్‌నగర్ యుహెచ్సీలో ఆశా వర్కర్లు వినతిపత్రాలు అందించారు.