Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుంటుపడ్డ సైన్స్ పరిశోధనలు
- మళ్లీ మనుధర్మంలోకి నెడుతున్న కేంద్రం
- జ్ఞానాభివృద్ధికి బీజేపీ వ్యతిరేకం : ప్రొఫెసర్ హరగోపాల్
- రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా నూతన విద్యావిధానం
- పెద్ద వ్యాపారంగా ప్రాథమిక విద్య : ఎస్ఎఫ్ఐ సెమినార్లో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలో ఉన్నత విద్య మరింత సంక్షోభంలోకి నెట్టబడుతున్నదని ప్రొఫెసర్ జి.హరగోపాల్ అన్నారు. ఎస్ఎఫ్ఐ 17వ జాతీయ మహాసభలను పురస్కరించుకుని సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'ఉన్నత విద్య-నూతన విద్యావిధానం-2020' అనే అంశంపై నిర్వహించిన సెమినార్లో ఆయన ప్రసంగించారు. కరికులమ్ మార్పు పేరుతో మనుధర్మశాస్త్రాన్ని అందరిమీదా రుద్దే ప్రయత్నం జరుగుతున్నదని ఆందోళన వెలిబుచ్చారు. దళితులకు, మహిళలకు విద్య అవసరం లేదని వాదించే, జ్ఞానాభివృద్ధికి వ్యతిరేకమైన పార్టీ నేడు కేంద్రంలో అధికారంలో ఉందని వాపోయారు. దిగువ సామాజిక తరగతుల వారి పిల్లలు సైంటిస్టులుగా ఎదగటం నేటి పాలకులు ఇష్టం లేదని విమర్శించారు. ఉన్నత విద్యకు గ్రాంట్లు తగ్గటం వల్ల సైన్స్ పరిశోధనలు కుంటుపడ్డాయని ఆందోళన వెలిబుచ్చారు. ఎనిమిదో తరగతిలోనే డ్రాపౌట్ కావొచ్చనీ, చదువు నుంచి తప్పుకున్న ఆ పిల్లలు తన తండ్రి చేసే కులవృత్తిలో శిక్షణ పొందాలంటూ నూతన విద్యావిధానంలో చెప్పటం దారుణమని విమర్శించారు. యూని వర్సిటీల్లో భావఘర్షణ తగ్గిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం ఫాసిజం వైపు వెళ్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
'ప్రాథమిక విద్య-నూతన జాతీయ విద్యా విధానం' అనే అంశంపై ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ...ప్రపంచబ్యాంకు, కార్పొరేట్ సంస్థలకు మేం గులాంగురి చేస్తాం.. ప్రజలు మాకు బానిసలుగా ఉంటారన్నట్టుగా కేంద్రంలోని పాలకులు నూతన జాతీయ విద్యావిధానం తీసుకొచ్చిందని విమర్శించారు. గతంలో 10+2+3 విద్యావిధానం ఉండేదనీ, ప్రస్తుతం దాన్ని 5+3+3+2+4గా ప్రతిపాదించడం దారుణమని అన్నారు. ఇంటర్ విద్య కంటే పూర్వప్రాథమిక విద్య పెద్ద వ్యాపారంగా మారిందని వివరించారు. ఒకటో క్లాసు సమయానికి నాలుగు తరగతులు చదవాల్సి వస్తున్నదని చెప్పారు. కేంద్రం తీసుకొచ్చిన విద్యావిధానం కార్పొరేట్లకు కాసులు కురిపిస్తున్న ఆ ప్రీఫైమరీ విద్యను చట్టబద్ధం చేసేందుకు దోహదపడుతుందని విమర్శించారు. దేశంలోని 60 శాతం పిల్లలు ఉండాల్సిన బరువు, ఎత్తు లేరని వివరించారు. తిండి సరిగ్గా తింటేనే ఆరోగ్యంగా ఉండి మంచిగా చదువుకోగలుగుతారని చెప్పారు. కానీ, దాని గురించి ఎక్కడా సరిగా లేదన్నారు. 3-8 ఏండ్లలోనే 90 శాతం మెదడు అభివృద్ధి చెందుతుందనీ, మన దేశంలో ఆ వయసున్న 60 శాతం పిల్లలకు సరైన తిండి అందట్లేదన్నారు. వీరంతా కార్పొరేట్ పాఠశాలల్లో చదువు కోగలుగుతారా? అని ప్రశ్నించారు. విద్యకు బడ్జెట్లో నెహ్రుకాలంలో 4.5 దాకా కేటాయిస్తే మోడీ సర్కారు దాన్ని 2.7 శాతానికి కుదించిందని విమర్శించారు. కరోనా పేరుతో కరికులం నుంచి ప్రజాస్వామ్యం అనే పాఠాన్ని తీసేయటం దారుణ మన్నారు. దేశంలో పెరుగుతున్న సాంఘిక,ఆర్థిక అస మానతలు అనే పాఠాన్ని కూడా తొలగించారన్నారు. ఓవైపు దేశాన్ని తిరోగమనం వైపు తీసుకెళ్లేలా కరికులమ్‌లో మార్పులు చేస్తున్నారనీ, ఇంకోవైపు విద్యారంగాన్ని పూర్తిగా ప్రయివేటు పరం చేసే కుట్రకు పూనుకున్నారని విమర్శించారు. అందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం లేదనీ, టీచర్ల పోస్టులు భర్తీ చేయడం లేదని తెలిపారు. ఈ సెమినార్లో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ఎల్.మూర్తి, టి.నాగరాజు, ఉపాధ్యక్షులు ఎం.పూజ, శంకర్, రజనీకాంత్, బషీర్, సహాయ కార్యదర్శులు అశోక్‌రెడ్డి, కిరణ్, వీరభద్రం, మిస్రీన్ సుల్తానా, తదితరులు పాల్గొన్నారు.