Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్కీ సదస్సులో జయేష్‌రంజన్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సులభతరమైన పారిశ్రామిక విధాన నిర్ణయాల రూపకల్పన వల్ల తెలంగాణ రాష్ట్రం పెట్టుబడుల ఆకర్షణలో మొదటిస్థానంలో నిలిచిందని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్ అన్నారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) 66వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా 'విధానాల రూపకల్పన-తెలంగాణ నుంచి ఉదాహరణలు' అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. విధానాల రూపకల్పనలో తన అనుభవాలను ఆయన సభికులతో పంచుకున్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన వివిధ క్లియరెన్స్‌ల జారీకి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఉద్దేశించిన ''తెలంగాణ స్టేట్ ఇండిస్టియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్-సర్టిఫికేషన్ సిస్టమ్ (టీఎస్-ఐపాస్) వంటి విధానాలను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. పరిశ్రమలతో పాటు పర్యావరణ పరిరక్షణా వ్యవస్థ కోసం టి-హబ్, టి-వర్క్స్, వీ-హబ్, టిఎస్ఐసి, టాస్క్ అండ్ రిచ్ వంటి పలు ఆవిష్కరణల గురించి ఆయన మాట్లాడారు. అనంతరం సభికులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. కార్యక్రమానికి ఆస్కీ చైర్మెన్ కే పద్మనాభయ్య అధ్యక్షత వహించగా, ఇంచార్జి డైరెక్టర్ జనరల్ డాక్టర్ నిర్మల్యబాగ్చి స్వాగతోపన్యాసం చేశారు.