Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :
భారీ ఎత్తున ఆదాయ పన్ను ఎగవేతకు పాల్పడ్డారన్న ఆరోపణలపై నగరంలోని ప్రముఖ నిర్మాణ సంస్థ వంశీరామ్ బిల్డర్స్ కార్యాలయాలు, సంస్థ ఎండీ సుబ్బారెడ్డి, ఆయన బంధువుల నివాసాలపై మంగళవారం ఉదయం ఐటీ అధికారులు మెరుపు దాడులను నిర్వహించారు. దాదాపు 36 మంది అధికారులు బృందాలుగా ఏర్పడి సోదాలు జరిపారు. గత రెండేండ్ల కాలంలో వంశీరామ్ బిల్డర్స్ సాగించిన నిర్మాణాలు, ఇతర రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, తదితర అంశాలపై నిశితంగా దృష్టిని సారించిన ఐటీ అధికారులు వాటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఆరా తీసినట్టు తెలిసింది. ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైన సోదాలు రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగాయి. జూబ్లిహిల్స్ ఫిలిమ్‌నగర్‌లోని సుబ్బారెడ్డి నివాసం, సంస్థ కార్పొరేటు కార్యాలయంలో సోదాలు నిర్వహించి అక్కడి సిబ్బంది నుంచి సంస్థ అకౌంట్స్‌కు సంబంధించిన హార్డ్ డిస్క్‌లను, ఇతర ఫైళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. అలాగే, సుబ్బారెడ్డి సమీప బంధువు జనార్ధన్ రెడ్డి నివాసంలోనూ సోదాలు నిర్వహించి రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. వంశీరామ్ బిల్డర్స్ ఆధ్వర్యానా 80కి పైగా ప్రాజెక్టులు సాగుతున్నట్టు తెలిసింది. కాగా, నిర్మాణాలు, ఇతర ఆదాయ, వ్యయాలకు సంబంధించి భారీ మొత్తంలో అవకతవకలు జరిగాయంటూ ఐటీ అధికారులు సోదాలు సాగించినట్టు సమాచారం.