Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని విస్మరిస్తూ పాలన కొనసాగిస్తున్నదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ,కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ విమర్శించారు. రాజ్యాంగ హక్కులను పూర్తిగా కాలరాస్తున్నదని అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం విద్యార్థులు కృషి చేయాలని కోరారు. రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వంపై పోరాటాలకు విద్యార్థి లోకం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్లోని నారాయణగూడ సర్కిల్లో అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసి పేద, మధ్య తరగతి వర్గాలకు విద్యను దూరం చేసే కుట్రను మోడీ ప్రభుత్వం చేస్తున్నదని విమర్శించారు. అందులో భాగమే నూతన జాతీయ విద్యావిధానం- 2020 తీసుకొచ్చిందని వివరించారు. విద్యా కార్పొరేటికరణ, కాషాయీకరణ చేయాలని కేంద్రం కుట్ర పన్నుతున్నదని అన్నారు. దీనివల్ల దాదాపు 90 శాతం విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందే హక్కును కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా వ్యాపారీకరణ వల్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలు విద్యకు దూరమవుతారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగ సమస్యలను గాలికి వదిలేశాయని విమర్శించారు. విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం సమరశీల ఉద్యమాలు చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్లు రెహమాన్, బరిగల వెంకటేష్, గ్యార క్రాంతి, బాలసాని లెనిన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి సంతోష్, అన్వర్, అంజి, ప్రేమ్, కేశవ్, పవన్ చౌహాన్, గణేష్, రవితేజ, క్రాంతిరాజ్, ప్రీతమ్ తదితరులు పాల్గొన్నారు.