Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమిషనరేట్లో విద్యార్థుల సమక్షంలో చర్చలు
- మాట తప్పితే ఆందోళన తప్పదు-ముత్తినేని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అంధ విద్యార్థుల సమస్యలను నెలలోగా పరిష్కరిస్తామని వికలాంగుల సంక్షేమ కమిషనర్ శైలజ హమీ ఇచ్చారు. 'మా సమస్యలు పరిష్కరించాలి..హాస్టళ్లలో కనీస వసతులు కల్పించాలి.. అధికారుల వేధింపులు ఆపాలి'..తదితర నినాదాలతో అంధ విద్యార్థులు మంగళవారం వికలాంగుల కమిషనరేటు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన జేఏసీ, కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం రాష్ట్ర చైర్మెన్ ముత్తినేని వీరయ్య సమక్షంలో కమిషనర్ శైలజ, కార్పొరేషన్ చైర్మెన్ వాసుదేవరెడ్డి చర్చలు జరిపారు. అంధ విద్యార్థుల నాలుగు ప్రభుత్వ హాస్టళ్లలో తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన చేస్తున్నామని అధికారులకు తెలిపారు. అన్నం మాని ఉపవాసంలో ఉన్నా..పట్టించుకోరా? అని ప్రశ్నించారు. విద్యార్థినుల హాస్టళ్లలో ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు మిగతా వసతి గృహాల్లో ఉన్న సమస్యలను కూడా నెల రోజుల్లో పరిష్కారం చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. అంధ విద్యార్థులు అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ, వాటిని పరిష్కారం చేయకపోతే ఆందోళన తప్పదని ముత్తినేని తెలిపారు.