Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిక్రూట్మెంట్ బోర్డు చైర్మెన్ రొనాల్డ్‌రోస్‌కు టీఎస్‌యూటీఎఫ్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గురుకుల టీచర్ల నియామకాల్లో పార్ట్ టైం, గెస్ట్, ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులకు సర్వీస్ వెయిటేజీ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు చైర్మెన్ రొనాల్డ్‌రోస్‌ను మంగళవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, టీఎస్‌యూటీఎఫ్ సీనియర్ నాయకులు పి మాణిక్‌రెడ్డి కలిసి వినతిపత్రం సమర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి ఆన్లైన్ ద్వారా వినతిపత్రాన్ని పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ శాఖల సొసైటీల ఆధ్వర్యంలో నెలకొల్పిన వందలాది గురుకుల విద్యాసంస్థల్లో వేలాదిమంది అర్హత కలిగిన ఉపాధ్యాయులు తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్నారని వివరించారు. వారికి గురుకుల ఉపాధ్యాయుల నియామకాల్లో సర్వీసు వెయిటేజి ఇవ్వాలని కోరారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల గురుకుల విద్యాలయాల సంస్థలో గెస్ట్ టీచర్లు, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, జనరల్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో పార్ట్ టైం, మైనార్టీ సంక్షేమ విద్యాసంస్థలో ఔట్ సోర్సింగ్ తదితర పేర్లతో తాత్కాలిక ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని తెలిపారు. వారిని మెరిట్, డెమో ఆధారంగా ఎంపిక చేశారని పేర్కొన్నారు. ప్రతి ఏటా వారి సామర్థ్యాన్ని పరీక్షించి రెన్యూవల్ చేస్తున్నారని గుర్తు చేశారు. పేరుకు పార్ట్ టైం/ గెస్ట్/ ఔట్ సోర్సింగ్ అయినా వారు పాఠశాలల్లో పూర్తికాలం సేవలందిస్తున్నారని తెలిపారు. రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా హౌజ్ మాస్టర్, కేర్ టేకర్, సూపర్వైజరీ స్టడీ, నైట్ స్టే, హాలిడే డ్యూటీ, ఎస్కార్ట్ తదితర అన్నిరకాల విధులనూ నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. వారు గురుకుల విద్యాసంస్థల్లోని పని పద్ధతులకు అలవాటు పడి, అనుభవం కలిగి, విద్యార్థులతో అనుబంధం కలిగి ఉన్నారని వివరించారు. వారి సేవలను గురుకులాల్లోనే శాశ్వత ప్రాతిపదికన ఉపయోగించుకోవటం సమంజసంగా ఉంటుందని తెలిపారు. తెలంగాణ గురుకుల విద్యాసంస్థల ఉపాధ్యాయ నియామకాల బోర్డు ఆధ్వర్యంలో సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో జరిగే ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో ప్రస్తుతం వాటిలో పనిచేస్తున్న పార్ట్ టైం, గెస్ట్ ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులకు వారు చేసిన సర్వీసు ప్రతిపదికన వెయిటేజీ లేదా ప్రాధాన్యతనివ్వాలని కోరారు.