Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్
నవతెలంగాణ-ధూల్ పేట్
బాబ్రీ మసీదు కూల్చివేత తీవ్రమైన న్యాయ ఉల్లంఘనని, లౌకికవాదం, ప్రజాస్వామ్యంపై దాడి అని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ అన్నారు. మంగళవారం బాబ్రీ మసీదు కూల్చివేత దినంను నిరసిస్తూ ఆవాజ్ హైదరాబాద్ సౌత్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లౌకిక, ప్రజాస్వామ్య విలువల పునాదులపై నిర్మితమైన దేశాన్ని హైజాక్ చేసి మతోన్మాదం, విద్వేషం పునాదులపై నిర్మించాలని సంఫ్‌ు పరివార్ కలలు కంటోందన్నారు. అసత్యాలు, కట్టుకథలు ఆధారం చేసుకొని విషప్రచారం చేసి బాబ్రీ మసీదును కూల్చి వేశారని ఆరోపించారు. అధికారం కోసం మతాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఇలాంటి దాడులకు పాల్పడుతున్నదని తెలిపారు. ప్రజలు ఏమైనా బీజేపీకి అవసరం లేదని, అధికారం సంపాదించడమే దాని అంతిమ లక్ష్యంగా ఉందన్నారు. దీనిని లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో కార్పొరేట్, మతోన్మాద శక్తుల మైత్రి బంధం కొనసాగుతున్నదని, ప్రజా సంపద, ప్రకృతి వనరులను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడున్నారని విమర్శించారు. అభివృద్ధి నిరోధక పాలనకు చరమగీతం పాడాలని అన్నారు. సంఫ్‌ు పరివార్ ప్రోద్బలంతో మైనారిటీలు, దళితులు, మహిళలు, అణగారిన వర్గాలపై జరుగుతున్న దాడులను, బీజేపీ అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాల్ని ఖండించాలని ప్రజలను కోరారు. దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని, లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని, కాపాడుకోవాలన్నారు.కార్యక్రమంలో ఆవాజ్ హైదరాబాద్ సౌత్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అబ్దుల్ లతీఫ్, అబ్దుల్ సత్తార్, నగర నాయకులు మహమ్మద్ కలీం, గఫార్ ఖాన్, మహ్మద్ రఫీ, మొహమ్మద్ సాజిద్, షేర్ తదితరులు పాల్గొన్నారు.