Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
'మొదటి దశలో చేపట్టిన ఎల్బీనగర్, నాగోల్ వేర్వేరు మార్గాల మెట్రో రూట్లను కలుపుతూ నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మిగిలిపోయిన 5 కి.మీ మెట్రోను రెండో దశలో చేపడతామని, ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు మెట్రోను ఎన్నికల తర్వాత విస్తరిస్తామని మున్సిపల్, పట్టణాభివృద్ధి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో సమతుల్యమైన అభివృద్ధి, సంక్షేమం జోడి ఎద్దుల మాదిరిగా అమలు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో కూడా గెలుస్తుందని, మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు రూ. 55 కోట్ల విలువగల పలు అభివృద్ధి కార్యక్రమాలను మంగళవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అభివృద్ధి కొత్త నమూనాను దేశం ముందు ఆవిష్కరిస్తూ పట్టణ, పల్లె అభివృద్ధి, పరిశ్రమలు-పర్యావరణం, వ్యవసాయం, ఐటీ సమతుల్యమైన కొత్త ఇంటిగ్రేటెడ్ హెలిస్టిక్ మోడల్‌ను సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ఎస్ఎన్డీపీ పథకం కింద జీహెచ్ఎంసీ పరిధిలో రూ. 985 కోట్లతో 56 పనులను చేపట్టనున్నట్టు తెలిపారు. అందులో జీహెచ్ఎంసీ రూ. 724 కోట్లతో 34 పనులను చేపట్టిందని, ఇప్పటి వరకు రెండు పనులు పికెట్ నాలాపై బ్రిడ్జి, బండ్లగూడ చెరువు నుంచి నాగోల్ చెరువు వరకు నాలా పనులు పూర్తి చేశామని తెలిపారు. డిసెంబర్ చివరి నాటికి 17 పనులు పూర్తి చేస్తామన్నారు. మరో 15 పనులు జనవరి వరకు పూర్తి చేస్తామని తెలిపారు. హుస్సేన్ సాగర్ సర్ఫేస్ నాలా, బల్కాపూర్ నాలా ఎండాకాలం వరకు పూర్తి చేస్తామని చెప్పారు. జీహెచ్ఎంసీ చుట్టుపక్కల మున్సిపాల్టీల్లో రూ. 240 కోట్లతో 21 పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. తెలంగాణ వచ్చిన సమయంలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1.24లక్షలని, తెలంగాణ వచ్చిన ఏడేండ్లలో రూ. 2.78లక్షల తలసరి ఆదాయంతో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని గర్వంగా చెప్పవచ్చన్నారు. జీఎస్డీపీ తెలంగాణ వచ్చిన సమయంలో రూ.5.6లక్షల కోట్లని, ఈ రోజు రూ.11.55లక్షల కోట్లు ఉందన్నారు. కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్, సురభి వాణిదేవి, బుగ్గారపు యోగానాథ్, శంబీపూర్రాజు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.