Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కంటి పరీక్షలు చేసి, ఉచితంగా అద్దాల పంపిణీ
- పంచాయతీ, మున్సిపల్ శాఖలతో సమన్వయంతో ముందుకు
- జగిత్యాల కలెక్టరేట్ నుంచి కలెక్టర్లు, వైద్యాధికారులతో మంత్రి హరీశ్‌రావు వీడియో కాన్ఫరెన్స్
నవతెలంగాణ-జగిత్యాలటౌన్
జనవరి 18వ తేదీ నుంచి ప్రారంభించనున్న రెండో విడత కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రణాళికా బద్ధంగా నిర్వహించి విజయవంతం చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారు లను ఆదేశించారు. మంగళవారం జగిత్యాల కలెక్టరేట్ నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లు, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో కంటి వెలుగు కార్యక్రమం పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఎంతో మేలు చేసే ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల్లోని అధికారులు ఉత్సాహంగా పాల్గొనాలని, ఎక్కడా నిర్లక్ష్యం వహించకూడదని చెప్పారు. మొదటి విడత కంటి వెలుగు 8 నెలలు జరిగిందని, రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం 100 పనిదినాల్లో పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం మొదటి సారి 827 బృందాలు పని చేస్తే, ఇప్పుడు 1500 ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ పరీక్షలు చేసి ఉచితంగా అద్దాలు పంపిణీ చేస్తామని తెలిపారు. ఇందులో 30 లక్షల రీడింగ్ గ్లాసెస్, 25 లక్షల ప్రిస్క్రిషన్ గ్లాసెస్ ఉంటాయని, కార్యక్రమం ప్రారంభానికి ముందుగానే అవసరమైన అద్దాలు ఆయా జిల్లాలోకి పంపిణీ చేయడం పూర్తి చేయాలని అధికారులను ఆదేశిం చారు. పరీక్షలు చేసిన నెల రోజుల్లో ప్రిస్క్రిప్షన్ అద్దాలు పంపిణీ చేయాల్సి ఉంటుందన్నారు. కార్య క్రమం కోసం ప్రభుత్వం రూ. 200 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. రోజు వారీ వైద్య సేవలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసుకోవాల న్నారు. జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులు, వివిధ శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో కార్యక్రమం విజయ వంతం చేయాలన్నారు. మున్సిపల్, పంచాయితీరాజ్ అధికారులతో చర్చించి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్లాన్ చేసుకోవాలన్నారు. మండల, జిల్లా, పురపాలక సంఘం మీటింగ్‌లలో కంటి వెలుగుపై చర్చించి ప్రజా ప్రతినిధులకు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయాలని సూచించారు. సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ శ్వేత, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్, జిల్లా అదనపు కలెక్టర్ మందా మకరంద్, హైదరాబాద్ నుంచి వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి పాల్గొన్నారు.