Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సినిమా థియేటర్ కార్మికులతో వెట్టి..
- వారికి కనీస వేతనాలివ్వాలి : సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం వెంకటేశ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సినిమా థియేటర్లలోని కార్మికులతో రోజుకు 16గంటల పాటు పనిచేయిస్లూ యాజమాన్యాలు వారితో వెట్టి చేయిస్తున్నాయని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం వెంకటేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతజేసినా వారికి కనీస వేతనాలు అమలు కావటం లేదని వాపోయారు. ఈ అంశంపై కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్లోని సీఐటీయూ కార్యాలయంలో తెలంగాణ సినిమా థియేటర్స్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధమ మహాసభను నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ కార్మికుల శ్రమను దోచుకుంటున్న యజమాన్యాలకు మద్దతుగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా థియేటర్లలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతన చట్టం అమలు కావటం లేదన్నారు. ప్రభుత్వాధికారులు, థియేటర్ యజమానులు కుమ్మక్కై కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని తెలిపారు. ఎనిమిది గంటల పని విధానాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి పనికి తగ్గ వేతనం ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. రోజు రోజుకు నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా.. కార్మికుల జీతాలు అందుకు తగ్గట్టుగా పెరగటం లేదని చెప్పారు. ఎక్కువ మందికి ఈఎస్ఐ, పీఎఫ్ అమలు కావటం లేదన్నారు. ఈ సమస్యలు, డిమాండ్లన్నింటిపై పోరాడాలని ఆయన కార్మికులకు పిలుపునిచ్చారు. మహాసభలో నూతన కమిటీని ఎన్నుకున్నారు.
నూతన కమిటి ఎన్నిక..
అధ్యక్షులుగా ఎన్ మారన్న, ప్రధాన కార్యదర్శిగా కె అరుణ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె రాము (మహబూబ్నగర్), ఎన్ రామస్వామి (హైదరాబాద్), వైస్ ప్రెసిడెంట్ జే సుధాకర్ (రంగారెడ్డి), పి మనోహర్ రెడ్డి (హైదరాబాద్ సౌత్), ఆర్ నరేష్ (మహబూబాబాద్), జె ప్రభాకర్ (హైదరాబాద్ సెంట్రల్), చంద్రశేఖర్ (పీవీఆర్), సహాయ కార్యదర్శి వి కమలాకర్ (మల్కాజిగిరి మేడ్చల్), కే సతీష్ (రంగారెడ్డి), సారయ్య (వరంగల్ అర్బన్), శ్రీనివాస్ గౌడ్ (నిజామాబాద్), రాజు( సిద్ధిపేట్), శ్రీనివాస్ రెడి,్డ గీత, కోశాధికారి వీరనారాయణ (హైదరాబాద్), సహాయ కోశాధికారిగా రాజు ఎన్నికయ్యారు. రాష్ట్ర కమిటి సభ్యులుగా మరో పది మందిని ఎన్నుకున్నారు.