Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన యూనివర్సిటీని తక్షణం ఏర్పాటు చేయాలి
- దరఖాస్తు పెట్టుకున్న పోడు రైతులందరికీ హక్కుపత్రాలివ్వాలి
- ఎస్టీ రిజర్వేషన్ 10 శాతానికి పెంచాలి
- గిరిజన బంధు పథకాన్ని తక్షణమే ప్రారంభించాలి
- టీజీఎస్ సెమినార్లో వక్తలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అటవీ సంరక్షణ నియమాలు 2022 బిల్లును ఉపసంహరించు కోవాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గిరిజన హక్కులను హరిస్తున్నదని వక్తలు విమర్శించారు. రాష్ట్ర విభజన చట్టంలో హామీ ఇచ్చినట్టుగా తెలంగాణ గిరిజన యూనివర్సిటీ తక్షణమే ఏర్పాటు చేయాలని కోరారు. గిరిజన జనాభా ప్రకారం పది శాతం రిజర్వేషన్ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా గిరిజన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. రాష్ట్రంలో పోడు సమస్య తీవ్రంగా ఉందనీ, దరఖాస్తు పెట్టుకున్న పోడు సాగుదారులందరికీ వెంటనే హక్కు పత్రాలు ఇవ్వాలని కోరారు. దళిత బంధు తరహాలో గిరిజన బంధు పథకాన్ని ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ గిరిజన సంఘం (టీజీఎస్) ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం 'గిరిజన హక్కులు- సవాళ్లు' అనే సెమినార్ నిర్వహించారు. ఆ సంఘం అధ్యక్షులు ఎం. ధర్మనాయక్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడూతూ దేశంలో 715 గిరిజన తెగలు, 15 కోట్ల మంది గిరిజనులున్నారనీ, వారిని అభివృద్ధి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా అడవులు, అటవీ సంపదను అంబానీ, ఆదాని లాంటి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు వచ్చే పార్లమెంటు సమా వేశాల్లో అటవీ సంరక్షణ నియమాలు 2022 బిల్లును ప్రవేశపెడుతున్నదని విమర్శించారు. ఆ బిల్లు చట్ట రూపంలో అమలైతే దేశంలో అడవులపై ఆధారపడ్డ లక్షలాది మంది ఆదివాసీ, గిరిజనులు బలవంతంగా అడవుల నుంచి గెంటి వేయబడతారని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు అమ్మేయడం వల్ల గిరిజనులు దళితులకు కల్పించిన రిజర్వేషన్లు పూర్తిగా నిర్వీర్యమవుతున్నాయని అన్నారు. భారత రాజ్యాంగాన్ని మార్చి మనుధర్మాన్ని ప్రవేశపెట్టేందుకు అనేక కుట్రలు చేస్తున్నదని అన్నారు. గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయకపోవ డం వల్ల విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని చెప్పారు. తెలంగాణ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ లావుడియా జీవన్‌లాల్ మాట్లా డుతూ గిరిజనులుగా పుట్టి గిరిజనుల కోసం మాట్లాడం 'నా జన్మ హక్కు' అన్నారు. దేశంలో విద్యుత్తు, ప్రాజెక్టుల నిర్మాణాల పేరుతో లక్షలాది మంది గిరిజనులు నిర్వాసితులవుతున్నారనీ, వారిచ్చిన త్యాగాలతోనే కరెంటు, సాగునీరు వంటి అవసరాలు తీరుతున్నాయని అన్నారు. దేశంలో ఉక్కు పరిశ్రమలకు ఖనిజ సంపద మొత్తం గిరిజన ప్రాంతాల నుంచి సరఫరా అవుతుందనీ, కానీ ఆ ప్రాంతాల్లో గిరిజనులకు విద్య, ఉపాధి, ఉద్యోగాలు కల్పించడంలో పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం వైద్య సౌకర్యం లేక వందల మంది గిరిజనులు చనిపోతున్న దృశ్యాలు మనల్ని కలిసి వేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం గిరిజన జాతుల్లో పుట్టిన మనం ఎవరు వ్యతిరేకించినా మన పని చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాంనాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన ముఖ్యమైన హామీలను కొన్ని అమలు చేసిందనీ, ఇంకా కొన్ని అమలు చేయాలని కోరారు. రాబోయే కాలంలో పోరాటాలు నిర్వహించాలన్నారు. సీఎం ప్రకటించినట్టుగా గిరిజనులకు గిరిజన బంధు పథకాన్ని తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. తండాలను గ్రామపంచాయతీలుగా చేసినా తండాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వక పోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని అన్నారు. ఒక్కో తండా గ్రామపంచాయతీకి కోటి రూపాయల నిధులు ప్రత్యేకంగా ఇచ్చే విధంగా బడ్జెట్లో నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. గిరిజన సంఘం రాష్ట్ర మూడో మహాసభలు నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో 2023 ఫిబ్రవరిలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సంఘం రాష్ట్ర నాయకులు డి.రవినాయక్, భూక్యా వీరభద్రం, గుగులోత్ భీమా నాయక్, అంగొత్ వెంకన్న, ఎం బాలునాయక్, వి.వీరన్న, కొర్ర శంకర్, ఎం.శంకర్, ఎం.రవినాయక్, పార్వతి, తదితరులు పాల్గొన్నారు.