Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 13 నుంచి ఓయూలో ఎస్ఎఫ్ఐ అఖిల భారత మహాసభలు
- తొలిరోజు నెక్లెస్‌రోడ్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు విద్యార్థుల ప్రదర్శన
- బహిరంగసభకు ముఖ్యఅతిధిగా త్రిపుర మాజీ సీఎం మాణిక్‌సర్కార్
- మహాసభలను ప్రారంభించనున్న జస్టిస్ కె చంద్రు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) అఖిల భారత 17వ మహాసభలకు ఉద్యమాల పురిటిగడ్డ హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) వేదికైంది. ఈ మహాసభలు ఈనెల 13 నుంచి 16వ తేదీ వరకు జరగనున్నాయి. మొదటిరోజు హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్‌లో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం నుంచి వేలాది మంది విద్యార్థులతోప్రదర్శన ప్రారంభమవుతుంది. పీపుల్స్‌ప్లాజా వద్ద బహిరంగసభను నిర్వహించనున్నారు. ఈ సభకు ముఖ్యఅతిధిగా త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌సర్కార్ హాజరవుతారు. అదేరోజు సాయంత్రం ఐదు గంటలకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఎస్ఎఫ్ఐ అఖిల భారత 17వ మహాసభల్లో భాగంగా జస్టిస్ కె చంద్రు ప్రతినిధుల సభను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన సంఘం చైర్మెన్, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, గౌరవ చైర్మెన్ ఘంటా చక్రపాణి, ముఖ్య సలహాదారు, మాజీ ఎమ్మెల్సీ కె నాగేశ్వర్, ఎష్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షులు విపి సాను, ప్రధాన కార్యదర్శి మయూక్ బిశ్వాస్‌తోపాటు జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు పాల్గొంటారు. ఈ మహాసభలకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 800 మంది ప్రతినిధులు, పరిశీలకులు హాజరవుతారు. ప్రారంభసభ సందర్భంగా ఠాగూర్ ఆడిటోరియంలో జెండావిష్కరణ కోసం అలంకరణ చేస్తున్నారు. అందుకే ఈ మహాసభల్లో పాల్గొనేందుకు ఉత్సాహంగా విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. 'హలో విద్యార్థి... చలో పోదాం హైదరాబాద్' అని నినదిస్తున్నారు.
నగరం ముస్తాబు
ఎస్ఎఫ్ఐ అఖిల భారత మహాసభల కోసం హైదరాబాద్ మహానగరం ముస్తాబవుతున్నది. ఇందుకోసం ఆహ్వానసంఘం ఏర్పాట్లు చేస్తున్నది. ఎస్ఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు, ఇతర ప్రజాసంఘాల నాయకులు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంగణంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ వాల్‌రైటింగ్స్ రాశారు. ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, తోరణాలను ఏర్పాటు చేశారు.
జెండాలు కడుతున్నారు. ఈ మహాసభలను పురస్కరించుకుని వెయ్యికిపైగా సెమినార్లు నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యావ్యతిరేక విధానాలపై చర్చించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా తెచ్చిన నూతన జాతీయ విద్యావిధానం-2020పైనా అవగాహన కల్పించారు. ఇందులో రెండున్నర లక్షల మంది విద్యార్థులను భాగస్వామ్యం చేశారు. వ్యాసరచన, వ్యక్తృత్వ పోటీలను నిర్వహించారు. అమరవీరుల ఫొటోలతో హోర్డింగ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 14న రెండోరోజు ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన మాజీ నాయకులతో ప్రత్యేక సమావేశం ఉంటుంది. సీతారాం ఏచూరి, ప్రకాశ్కరత్, నీలోత్పల్‌బసు, బీమన్బసు, కెఎన్ బాలగోపాల్, ఆర్ అరుణ్‌కుమార్, శివదాసన్, కెకె రాగేష్, విక్రంసింగ్ తదితరులు పాల్గొని సందేశాలనిస్తారు.