Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడో విడత ఇందిరమ్మ-ఇండ్లు ఇవ్వాలి
- నిరసన తెలపడానికి వెళితే సీపీఐ(ఎం) నాయకుల అరెస్ట్
- జనగామ పోలీస్స్టేషన్ ఎదుట ఐదు గంటల పాటు ధర్నా
నవ తెలంగాణ - జనగామ
నిలువ నీడలేని నిరుపేదలకు గూడు అడగటానికి వెళితే పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం ఆప్రజాస్వామికమని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి విమర్శించారు. జనగామ జిల్లా కేంద్రంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ మూడో విడత ఇండ్ల స్థలంలో తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ఇండ్లు నత్తనడకన నడుస్తున్నాయని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో లబ్దిదారులు బుధవారం నిరసన తెలిపేందుకు ఇందిరమ్మ కాలనీ వద్దకు వెళ్లిన వారిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. దాంతో లబ్దిదారులు, సీపీఐ(ఎం) నాయకులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. సుమారు 500మంది లబ్దిదారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. దాంతో ఆగ్రహించిన లబ్దిదారులు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పోలీస్స్టేషన్లో ఐదు గంటల పాటు ధర్నా నిర్వహించారు. ఈ విషయంపై ఏసీపీ దేవేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శివలింగయ్యకు సమాచారం అందించడంతో స్పందించిన కలెక్టర్.. సమస్య పరిష్కరించేందుకు ఆర్డీవో మధుమోహన్ను పోలీస్ స్టేషన్లో ధర్నా నిర్వహిస్తున్న లబ్దిదారుల వద్దకు పంపించారు. జనగామ ఆర్డీవో మధుమోహన్, ఏసీపీ దేవేందర్ రెడ్డి, జనగామ తహసీల్ధార్ రవీందర్, సీఐ శ్రీనివాస్, హౌసింగ్ డీఈ దామోదర్, సీపీఐ(ఎం) నాయకులు మూడవ విడత ఇందిరమ్మ డబల్ బెడ్రూమ్ ఇండ్ల సాధన కమిటీ కలిసి గంటల సేపు చర్చలు జరిపారు. పది రోజుల్లో లబ్దిదారుల లిస్టు ఇస్తామని, త్వరితగతిన ఇండ్లు పూర్తిచేసి అర్హులకు అప్పగిస్తామని ఆర్డీవో ప్రకటించారు. దాంతో లబ్దిదారులు ధర్నా విరమించారు.
అనంతరం సీపీఐ(ఎం) జనగామ పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ అధ్యక్షత నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి మాట్లాడుతూ.. 2012-13లో జనగామ పట్టణంలో మూడవ విడతలో 1147మందికి గత ప్రభుత్వం ఇండ్ల స్థలాల పట్టాలు ఇచ్చిందన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లు గడిచినా టీఆర్ఎస్ ప్రభుత్వం లబ్దిదారులకు ఇండ్ల నిర్మాణానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. అంతేకాక, వారి స్థలాలను ఆక్రమించుకోవడంతో లబ్దిదారులు కోర్టును ఆశ్రయించారని, ప్రభుత్వం దిగొచ్చి 560మందికి డబుల్ ఇండ్లను ఏడాదిలో పూర్తిచేసి అప్పగిస్తామని స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, కలెక్టర్, ఆర్డీఓ, ఎమ్మార్వో చెప్పి నేటికీ నాలుగేండ్లు గడిచాయన్నారు. ఇప్పటికి 250 ఇండ్ల పనులు మాత్రమే ప్రారంభించారని తెలిపారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి ఇండ్లు పూర్తి చేసి వాటిలో గృహప్రవేశం చేయించాలని డిమాండ్ చేశారు. లేదంటే నిరుపేద లబ్దిదారులను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు, పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఇరి అహల్య, సీనియర్ నాయకులు బోట్ల శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు పుతుకునూరి ఉపేందర్, భూక్య చందు నాయక్, సుంచు విజేందర్, పట్టణ కమిటీ సభ్యులు బాల్నె వెంకట మల్లయ్య, బోట్ల శ్రావణ్, మూడో విడత ఇండ్ల సాధన కమిటీ అధ్యక్షులు కళ్యాణం లింగం, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.