Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చే విద్యాసంవత్సరంలో చేరాలంటూ ప్రకటన
- దోపిడీకి తెరలేపిన ప్రయివేటు, కార్పొరేట్ స్కూళ్లు
- చోద్యం చూస్తున్న పాఠశాల విద్యాశాఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రస్తుత విద్యాసంవత్సరం కొనసాగుతున్నది. ఇప్పుడిప్పుడే చదువులు గాడిన పడుతున్నాయి. విద్యార్థులు బడులకు రావడం, ఉపాధ్యాయులు పాఠాలను బోధించడం సాగుతున్నది. అయితే ఫీజు దోపిడీకి ప్రయివేటు, కార్పొరేట్ స్కూళ్లు తెరలేపాయి. ప్రస్తుత విద్యాసంవత్సరం ముగియనే లేదు. అప్పుడే అడ్మిషన్ల గోల మొదలైంది. వచ్చే విద్యాసంవత్సరం (2023-24)లో చేరాలంటూ అవి ప్రకటనలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రీప్రైమరీలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైందంటూ హైదరాబాద్‌లో ప్రముఖ ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలలు ప్రకటించడం గమనార్హం. ముందే సీటు రిజర్వు చేసుకుంటే ఫీజులో రాయితీ కల్పిస్తామంటూ ప్రచారం చేస్తున్నాయి. రంగురంగుల ప్రకటనలతో విద్యార్థులు, తల్లిదండ్రులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలో 40,597 పాఠశాలలున్నాయి. వాటిలో 10,549 ప్రయివేటు స్కూళ్లున్నాయి. ఇందులో హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఉండే ప్రముఖ పాఠశాలలే ప్రవేశాల ప్రక్రియకు ప్రకటనలు ఇస్తున్నాయి. ముఖ్యంగా ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ సిలబస్‌ను బోధించే స్కూళ్లు ముందువరుసలో ఉన్నాయి. అయితే కాలేజీల్లో ఉన్నట్టుగా పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియకు షెడ్యూల్ అంటూ ఏమీ లేదా?అన్న ప్రశ్నకు 'ఇంటర్లో చేరాలంటే పదో తరగతి పాస్ కావాలి. డిగ్రీలో ప్రవేశం పొందాలంటే ఇంటర్ పూర్తి కావాలి. ఇంజినీరింగ్‌లో చేరాలంటే ఎంసెట్ ఉత్తీర్ణత కావాలి. కానీ పాఠశాలల్లో ప్రీప్రైమరీలో ప్రవేశం కావాలంటే అంతకుముందు చదివి ఉండాలన్న నిబంధన లేదు. కాబట్టి ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలలు ప్రవేశాల కోసం ప్రకటనలు ఇస్తున్నాయి.'అని పాఠశాల విద్యాశాఖలో ఓ అధికారి సమాధామిచ్చారు. అయితే సర్కారు బడుల్లో ప్రవేశాల ప్రక్రియ మాత్రం వచ్చే విద్యాసంవత్సరంలోనే ప్రారంభమవుతుంది. అదీ ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులను చేర్చుకుంటారు. ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ప్రస్తుత విద్యాసంవత్సరంలోనే 2023-24 విద్యాసంవత్సరంలో ప్రవేశాలు చేపట్టడంతో విద్యార్థులు ఎక్కువ మంది ఇప్పుడే చేరతారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలు, పేద విద్యార్థులు ముఖ్యంగా గ్రామీణ, మండల ప్రాంతాల్లోనే అవగాహన లేని పిల్లలు వాటిలో చేరకుండా మిగిలిపోతారు. వారే సర్కారు చేరేందుకు మొగ్గుచూపుతారు. అందుకే ఏటా సర్కారు బడుల్లో పిల్లల సంఖ్య తగ్గుతున్నది.
అనివార్యంగా ప్రయివేటుకు...
ప్రభుత్వ విద్యావ్యవస్థను మెరుగుపరుస్తామంటూ పాలకులు అర్భాటాలు చేసినా ఆచరణలో అవి కాగితాలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. మరోవైపు ఉపాధ్యాయుల కొరత వేధిస్తున్నది. విద్యావాలంటీర్లను కూడా నియమించలేదు. దీంతో పిల్లల బతుకులు కూడా ఎక్కడ తమలాగా మారతాయోనన్న భయంతో అనివార్యంగా తల్లిదండ్రులు ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలలను ఆశ్రయిస్తున్నారు. అయితే ఆ పాఠశాలల్లో ఉండే ఫీజులను చూసి హడలెత్తిపోతున్నారు. రెండేండ్లుగా కరోనా నేపథ్యంలో వారి ఆదాయాలు పూర్తిగా పడిపోయాయి. ఇంకోవైపు లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. దీంతో సామాన్యులు, పేదలు, బలహీనవర్గాలకు చెందిన తల్లిదండ్రులు ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలంటే ఇబ్బంది పడుతున్నారు. ఆ ఫీజులను చూసి భయపడిపోతున్నారు. అయినా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వాటిలో చేర్పించేందుకే మొగ్గుచూపుతున్నారు. డబ్బున్న వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. వారు తమ పిల్లలను ఏ పాఠశాలలో చేర్పించాలో ముందే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రకటన వచ్చిన వెంటనే ఆ పాఠశాల యాజమాన్యాన్ని సంప్రదించి సీటును రిజర్వు చేసుకుంటున్నారు. వారి వద్ద డబ్బున్నా ముందే పిల్లలను చేర్పించడంతో రాయితీ లభిస్తున్నది. కానీ డబ్బులేని వారు ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చేర్పించడానికి విద్యాసంవత్సరం ప్రారంభమయ్యాక వస్తారు. వారికి ఫీజులో రాయితీ ఉండదు. మొత్తం ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఒక్కోసారి సీట్లు నిండితే దొరకని పరిస్థితి తలెత్తుతుంది. ఇంకోవైపు ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలుంటే ఆ తల్లిదండ్రులపై పెనుభారం పడనుంది. అందుకే వారు ఆ ఫీజుల భారాన్ని చూసి బెంబేలెత్తుతున్నారు. ఫీజుల నియంత్రణ కోసం ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు.