Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెదిరింపులు, నిర్బంధాలు
- నెల్లుట్ల భూ పోరాట కేంద్రంపై పోలీసుల దౌర్జన్యం ఆపాలి
- వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కమిటీ సభ్యులు బి ప్రసాద్ డిమాండ్
నవతెలంగాణ-లింగాలఘనపురం
నిరుపేదలు ఇండ్ల స్థలాల కోసం అనేక ఏండ్లుగా ఎదురు చూసి.. విసిగి వేసారి, ప్రభుత్వం మీద, అధికారుల మీద ఆశలు వదులుకొని ప్రత్యక్ష పోరాటాల్లోకి వస్తున్న వారిని దౌర్జన్యంగా అణిచే ప్రయత్నం చేయడం అత్యంత నీతిమాలిన చర్య అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కమిటీ సభ్యులు బి. ప్రసాద్ అన్నారు. బుధవారం జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నెల్లుట్ల గ్రామానికి అనుకొని ఉన్న ప్రభుత్వ భూమిలో పేదలు ఇంటి స్థలాల కోసం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చదును చేసుకుంటుంటే పోలీసులు దౌర్జన్యం చేస్తున్న విషయాన్ని తెలుసుకొన్న ఆయన భూ పోరాట కేంద్రాన్ని సందర్శించి వారితో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, మూడు ఎకరాల సాగు భూమి ఇస్తామని వాగ్దానం చేసి ఎనిమిదేండ్లు గడిచిందన్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోగా.. కొత్త కొత్త పథకాలను మళ్లీ మళ్లీ ప్రవేశ పెడుతూ ప్రజలను మోసం చేస్తున్నదని తెలిపారు. ఈ సందర్భంగా భూమిని చదును చేస్తున్న పేదలను ఆపేందుకు వచ్చిన స్థానిక పోలీసులు, పేదలకు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రజలు గట్టిగా నిలబడటంతో నాయకులను అరెస్టు చేసి తీసుకెళ్లారు. అరెస్టు చేసిన నాయకులను విడుదల చేసి, పోలీసు నిర్బంధాన్ని ఆపకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రజలు, నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సింగారపు రమేష్, వెంకటరాజం, ఉపాధ్యక్షులు గంగాపురం మహేందర్, సాంబరాజు దుర్గాప్రసాద్, గోసంగి శంకరయ్య తదితరులతోపాటు వివిధ గ్రామాల నుంచి వచ్చిన దళితులు, పేదలు, పాల్గొన్నారు.