Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండేండ్లుగా జరపని కేంద్రం
- కొనసాగుతున్న జలవివాదాలు
- తలలు పట్టుకుంటున్న అధికారులు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఏండ్ల తరబడి కొనసాగుతున్నాయి. పరిష్కారాలు ఎండ మావిగానే మిగులుతున్నాయి. ఈవిషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం స్పష్టంగా కనిపిస్తున్నది. రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తున్న మోడీ సర్కారు, ఇరు రాష్ట్రాల మధ్య సాగునీటి పంచాయతీల పరిష్కారానికి చిత్తశుద్ధిని ప్రద ర్శించడం లేదు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి, కేంద్ర, రాష్ట్రాల ఉన్నతాధికారులతో కూడిన అపెక్స్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించడం లేదు. దీంతో సాగునీటి వివాదాల పరిష్కారం ముందు నుయ్యి..వెనుక గొయ్యిలా తయారైంది.
ఈ సమావేశాలు తరచుగా జరిపితే, సాగునీటి సమస్యలు సైతం అంతే వేగంగా కొలిక్కిరావడానికి అవకాశముంటుంది. కాగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు. గత రెండేండ్లుగా ఈ సమావశాల జోలికి కేంద్రం పోలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ అపెక్స్ కౌన్సిల్ నిర్వహించాల్సి ఉంది. కానీ, ఇప్పటికీ ఆ సంగతి తేల్చలేదు. నాన్చుతూనే ఉంది. కృష్ణా జలాల పున:పంపిణీ, ఇతర సమస్యల పరిష్కారంపై అపెక్స్ కౌన్సిల్ దృష్టిసారిస్తుందని అనుకున్నారు కూడా. ఆ కౌన్సిల్ భేటిలో ప్రత్యేకించి కృష్ణానది జలాల విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలపై మరోసారి చర్చ జరగాల్సి ఉండగా, అది పెండింగ్‌లో పడింది. కృష్ణా, గోదావరి నదీ జలాల అంశంలో రెండు రాష్ట్రాల మధ్య అనేక అభ్యంతరాలు, అనుమానాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అపెక్స్ కౌన్సిల్ 2017లో ఒకసారి జరపగా, 2020, అక్టోబరులో మరోసారి భేటి జరిగిన సంగతి తెలిసిందే. ఈ భేటిలో తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సమావేశమయ్యారు. గత రెండేండ్లుగా అపెక్స్ కౌన్సిల్ భేటి ఒక్కసారీ కూడా జరగకపోవడం గమనార్హం. ఇప్పటికే గోదావరి నదీపైన ఎలాంటి అంతరాష్ట్ర ప్రాజెక్టులు లేని కారణంగా జీఆర్ఎంబీ బోర్డు అవసరం లేదని తెలంగాణ చెబుతుండగా, నిర్మాణం పూర్తయిన కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమమని ఏపీ సర్కారు అంటున్నది.
కృష్ణానదీ పరిధిలోని పోతిరెడ్డిపాడు, హంద్రినీవా, తెలుగు గంగ ప్రాజెక్టుల ద్వారా బేసిన్ అవతలకు ఏపీ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలిస్తున్నదని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెబుతున్నది. పదే పదే అటు కేంద్రానికి, ఇటు కేఆర్ఎంబీకి లేఖలు రాస్తున్నది. కేంద్రం నిర్లక్ష్యం ఫలితంగా తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణాజలాలను పున:పంపిణీ చేయాలనే డిమాండ్ దీర్ఘకాలికంగా పెండింగ్‌లోనే ఉంది. అది ఇటీవల మరింత తీవ్రమైంది. కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యూనల్ (కేడబ్ల్యూడీటీ-2) ప్రకారం నదీ జలాల పున:పంపిణీ జరిగి తీరాల్సిందేనని రాష్ట్రం పట్టుపడుతున్నది. కృష్ణానదిలో నీటి లభ్యత ఆధారంగా 75 శాతం ప్రాతిపదికన తెలంగాణకు 574 టీఎంసీలు ఇవాల్సి ఉందని ఇప్పటికే కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు రాష్ట్ర ప్రభుత్వం పలుసార్లు లేఖలు రాసింది. ఈ మేరకు నీటి కేటాయింపులు పున:పంపిణీ చేయాలని కోరినా కేఆర్ఎంబీ స్పందించడం లేదనీ, గతంలో మాదిరిగానే 299 టీఎంసీలనే కేటాయిస్తున్నదని ఫిర్యాదు చేసింది. అదే సమయంలో అంతరాష్ట్ర జల వివాదాల చట్టం-1956లోని సెక్షన్ 3 ప్రకారం ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాల పరిష్కారానికి, ప్రధానంగా కృష్ణా నదీ నీటి పంపిణీకి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని చాలా కాలంగా రాష్ట్ర ప్రభుత్వం కోరుతూనే ఉంది. కృష్ణా జలాల వివాదాల అంశాలతోపాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని అపెక్స్ కౌన్సిల్ ఎదుట తొలి నుంచి రాష్ట్ర ప్రభుత్వం వాదన వినిపిస్తూనే ఉందని నీటిపారుదల శాఖ ఉన్నతా ధికారులు చెబుతున్నారు. కేంద్రం అస్పష్టమైన వైఖరి నేపథ్యంలో రాష్ట్ర సాగునీటి శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ వివాదాలు ఇలా కొన సాగుతుండగానే కేఆర్ఎంబీ సభ్యులు, రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ(ఆర్ఎంసీ) చైర్మెన్ రవి పిళ్లై బదిలీకావడం కొసమెరుపు.