Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంట్రాక్టు పద్ధతిలో భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆరోగ్య తెలంగాణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం వడి వడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పట్టణాలు బస్తీల్లో సుస్తీని పోగొట్టేందుకు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసింది. అదే రీతిలో గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసి ప్రాథమిక స్థాయిలోనే వ్యాధి నిర్థారణ చేసి, చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానాలను ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 4,745 ఏఎన్ఎం సబ్ సెంటర్లు ఉండగా, ఇందులో 3,206 సబ్ సెంటర్లను పల్లె దవాఖానాలుగా మార్చాలని నిర్ణయించింది. ఈ పల్లె దవాఖానాల్లో 1,492 మంది వైద్యులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ జీవో నెంబర్ 1,563 జారీ చేసింది. వీరి నియమకానికి వెంటనే వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టనుంది.
పల్లె దవాఖానాల పని తీరు..ఇలా..
రాష్ట్రంలో 3,206 సబ్ సెంటర్లను పల్లె దవాఖానాలుగా మారనున్నాయి. అయితే ఇప్పటికే ఈ సబ్ సెంటర్లలో ఏఎన్ఎంలు, ఆశాలు రోగికి అవసరమైన మందులు అందజేస్తున్నారు. ఇప్పుడు వీటిని పల్లె దవాఖానాగా మార్చుతూ, వాటిల్లో 1,492 మంది వైద్యులను నియమిస్తుండటంతో, మరింత నాణ్యమైన సేవలు పల్లెల్లో అందనున్నాయి. పల్లె దవాఖానాల్లో అవసరమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలకు అవసరమైన శాంపిల్స్ సేకరిస్తారు. వాటిని టీ డయాగస్టిక్స్కు పంపుతారు. అక్కడి నుంచి వచ్చిన వ్యాధి నిర్ధారణ ఫలితాలను బట్టి వైద్యులు అవసరమైన చికిత్సనందిస్తారు. ప్రాథమిక దశలోనే ఈ పల్లె దవాఖానాల ద్వారా వ్యాధి ముదరకుండా చర్యలు తీసుకునే వీలు కలుగుతుంది. ఒక వేళ వ్యాధి తీవ్రంగా ఉంటే అలాంటి వారిని పల్లె దవాఖానా వైద్యుడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లేదా ఏరియా, జిల్లా ఆస్పత్రులకు రెఫర్ చేస్తారు.
3.206 సబ్ సెంటర్లలో ఇక నుంచి వైద్యులు.....
రాష్ట్రంలోని 3.206 సబ్ సెంటర్లలో 1,492 మంది వైద్యుల నియామకం చేయనుండగా, మరో 636 సబ్ సెంటర్లు పీహెచ్సీల పరిధిలోనే ఉన్నాయి. అంటే మొత్తంగా 3,842 సబ్ సెంటర్లలో డాక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. ఇక నుంచి పల్లె ప్రజలకు అనారోగ్యం వస్తే పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పల్లెల వద్దకే వైద్య సేవలు అందనున్నాయి.