Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాన నిందితుడు గజ్వేల్ జ్యూవెలరీ షాప్ యజమాని
నవతెలంగాణ-హయత్‌నగర్
హైదరాబాద్ నగరం నాగోల్‌లోని స్నేహపూరి కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 1న మహేదేవ్ జ్యూవెలరీ దుకాణంలో జరిగిన చోరీ కేసులో ఆరుగురు అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. బుధవారం ఎల్బీనగర్లో ఉన్న సీపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ పోలీస్ కమిషనర్, అడిషనల్ డీజీ మహేష్ మురళీధర్ భగవత్ వివరాలను వెల్లడించారు. మహదేవ జ్యూవెలరీ షాపులో ఈ నెల 1న ఇద్దరిపై దుండగులు కాల్పులు జరిపి బంగారం దోచుకెళ్లారని సమాచారం రావడంతో వెంటనే అక్కడకు చేరుకుని కాల్పుల్లో గాయపడ్డ సుఖ్‌దేవ్, సుఖ్రామ్లను స్థానిక ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. అనంతరం సీసీఎస్, ఎస్ఓటీ, క్రైమ్ టీంలు దర్యాప్తు ప్రారంభించాయన్నారు. ముసుగు ధరించి బైక్‌పై వచ్చిన నలుగురు వ్యక్తులు షాపులోకి చొరబడి గణపతి జ్యువెలరీ నుంచి తెచ్చిన గోల్డ్ బ్యాగ్ ఇవ్వాలని దుకాణ యజమానిని బెదిరించారు. అందుకు యజమాని ఒప్పుకోకపోవడంతో కాల్పులు జరిపి బంగారంతో అక్కడి నుంచి పరారయ్యారు. సీసీ ఫుటేజీ సాక్ష్యాలను సేకరిస్తూ దర్యాప్తేను ముందుకు తీసుకెళ్లినట్టు, మొదట నంబర్ ప్లేట్ లేని పల్సర్ బైక్ ఉందని, దర్యాప్తులో భాగంగా మరో స్కూటీకి సంబంధించిన చిన్న క్లూ దొరికిందని సీపీ చెప్పారు. వాటి ఆధారంగా ఆరుగురు నిందితులను పట్టుకున్నామన్నారు. మరో నలుగురు పరారీలో ఉన్నారని చెప్పారు.
రాజస్థాన్‌కు చెందిన ప్రధాని నిందితుడు మహేంద్ర చౌదరి గతంలో గుజరాత్లో బంగారం షాపు నడిపాడని పోలీసులు తెలిపారు. అనంతరం నాలుగేండ్ల కిందట గజ్వేల్‌కు వచ్చి జ్యూవెలరీ షాపు పెట్టాడని తెలిపారు. ఈ క్రమంలో ఓ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి రెక్కీ నిర్వహించి ఈ చోరీకి పాల్పడ్డారని వివరించారు. దోపిడీ జరుగుతున్న సమయంలో మహేంద్ర చౌదరి ఉప్పల్‌లోని ఓ బార్లో ఉన్నాడని, చోరీ అనంతరం బంగారం బ్యాగ్‌ను కొండపాకలోని సుమిత్ డాగర్ అనే వ్యక్తి ఇంట్లో పెట్టారన్నారు. అనంతరం మహేంద్ర చౌదరి భార్య గుడియా జాత్ను గజ్వేల్ నుంచి తీసుకొని నిర్మల్, ఆదిలాబాద్ మీదుగా మహారాష్ట్రకు వెళ్లారు. నిర్మల్ వద్ద గుడియాను దించి తిరిగి వెనక్కి పంపించారు. అరెస్టయిన వారిలో ప్రధాన నిందితుడయిన మహేంద్ర చౌదరి భార్య గుడియా జాత్, బన్సీరామ్ అలియాస్ మనీష్ దివాసి, మనీష్ వైష్ణవ్, రితేష్ వైష్ణవ్, సుమీర్ చౌదరి, గజ్వేల్‌కు చెందిన మహ్మద్ ఫిరోజ్ ఉన్నారు. మహేంద్ర చౌదరి, సుమిత్ డాగర్, మనిష్, మనియా పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 1.35 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, 3 కంట్రీ మెడ్ పిస్టళ్లు, ఒక ఎయిర్ పిస్టల్, 3 బైక్ లు, కారు, 65 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో ఎల్బీ నగర్ జోన్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్, అడిషనల్ క్రైమ్ డీసీపీ శ్రీనివాసులు, ఎస్ఓటీ డీసీపీ మురళీధర్, ఏసీపీ వెంకన్న, ఎల్బీ నగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు రవి కుమార్, సైదులు, సుధాకర్, రాములు, నవీన్ కుమార్, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.