Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డైలీవేజ్ వర్కర్లను పర్మినెంట్ చేయాలి
- తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్ డైలీవేజ్, ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం జీవో 212, జీవో 16ని సవరించాలనీ, ఐదేండ్ల సర్వీసున్న డైలీవేజ్ వర్కర్లందర్నీ పర్మినెంట్ చేయాలని తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్ డైలీవేజ్, ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) డిమాండ్ చేసింది. బుధవారం హైదరాబాద్‌లోని గిరిజన సంక్షేమ శాఖ కమిషనరేట్‌లో అడిషినల్ డైరెక్టర్ సర్వేశ్వర్‌రెడ్డి, జాయింట్ డైరెక్టర్ సైదా, రాష్ట్ర అధికారులు డైలివేజ్ వర్కర్స్ సమస్యలపై యూనియన్ నాయకులతో జాయింట్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్ డైలీవేజ్, ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) తరపున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు మాట్లాడారు. మూడు దశాబ్దాలకుపైగా రాష్ట్రంలో 3070 మంది కార్మికులు విద్యార్థులకు వంట చేయడం, విద్యాసంస్థలను శుభ్రం చేయడం వంటి పనులు చేస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారిని పర్మినెంట్ చేయడానికి అడ్డుగా ఉన్న జీవో నెం. 212, జీవో నెం. 16లను నవరించాలని డిమాండ్ చేశారు. పర్మినెంట్ ప్రక్రియ పూర్తయ్యే వరకు కనీస వేతనంగా రూ.26 వేలు ఇవ్వాలని కోరారు. కార్మికులకు నష్టదాయకమైన ఔట్సోర్సింగ్ విధానాన్ని ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. పీఎంహెచ్ హాస్టల్ వర్కర్స్కు ఇవ్వాల్సిన 21 నెలల వేతన బకాయిలను, డైలీవేజ్ వర్కర్లకు రావాల్సిన ఐదు నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. తపాలాశాఖ ప్రవేశపెట్టిన రూ.10లక్షల ఇన్సూరెన్స్ పాలసీని డైలీవేజ్ కార్మికులకు వర్తింపజేయాలనీ, ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలని కోరారు. ఎవరైనా కార్మికులు చనిపోతే వారి వారసులను డైలీవేజ్ కార్మికులుగా నియమించాలన్నారు. గుర్తింపు కార్డులు, యూనిఫారమ్, మొదటివారంలోనే వేతనాల చెల్లింపు, సమాన పనికి సమాన వేతనం, వేతనంతో కూడిన సెలవులు, 8 గంటల పని విధానం అమలు, తదితర డిమాండ్లను అమలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఏడీ సర్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ..యూనియన్ లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వంతో చర్చించి వీలైనంత మేరకు పరిష్కరిస్తామనీ, డైలీవేజ్ కార్మికులకు అన్యాయం జరుగకుండా చూస్తామని హామీనిచ్చారు. ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు టేకం ప్రభాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్, కార్యదర్శులు, బ్రహ్మచారి, రాజేందర్, ఉపాధ్యక్షులు, రాములు, సంగ్యానాయక్, కోటేశ్వరరావు, హీరాలాల్, మాతృ, శ్రీనివాస్, పద్మ, జలందర్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.