Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రైతుల రాస్తారోకో
నవతెలంగాణ -నర్సంపేట
ధాన్యం కొనుగోళ్లలో అనేక అక్రమాలకు పాల్పడుతున్న రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నర్సంపేట మండలం ఇటుకాలపెల్లి గ్రామంలో జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భూక్య సమ్మయ్య మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లలో రైస్ మిల్లర్లు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని, రైస్ మిల్లర్లకే పూర్తి అధికారాలు ఇచ్చినట్టు ప్రభుత్వం, అధికార యంత్రాంగం వ్యవహరించడంతో వారి ఆగడాలకు అడ్డు లేకుండా పోయిందని మండిపడ్డారు. బస్తాకు మూడు నుంచి నాలుగు కిలోల తరుగును తీస్తూ కోతలు విధిస్తున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రాల బాధ్యతను రైసుమిల్లర్లకు అప్పజెప్పడం వల్ల 40 కిలోల బస్తాకు నాలుగు నుంచి ఐదు కిలోలు కోత విధిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 40 కిలోల 750 గ్రాములు ఒక బస్తా తూకం వేయాల్సి ఉందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకాలు చేయకుండా రైస్ మిల్లులకే ధాన్యాన్ని తరలించడంతో రైతులు నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైసుమిల్లర్లతో అధికారులు కుమ్ముక్కయ్యారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. వాస్తవానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాలు నిర్వహించడం లేదని, కొనుగోలు కేంద్రం నుంచి మిల్లుకు తరలించే వరకు రైతే రవాణా చార్జీలనూ భరిస్తున్నాడని అన్నారు. ప్రభుత్వం స్పందించి రైస్ మిల్లర్ల ఆగడాలను నియంత్రించాలని కోరారు. లేదంటే ఆందోళన, పోరాటాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. విషయం తెలుసు కున్న తహసీల్దార్ వి.రామ్మూర్తి చేరుకొని రైతులకు నచ్చ జెప్పే ప్రయత్నం చేశారు. స్పష్టమైన హామీ ఇచ్చేంతవరకు ఇకనుంచి కదిలేది లేదని జాతీయ రహ దారిపై దాదాపు నాలుగు గంటల పాటు భీష్మించు కుకూర్చున్నారు. అదనపు కలెక్టర్‌తో మాట్లాడి కొనుగోలు కేంద్రాల్లోనే తూకాలు వేస్తామని, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే కొనుగోలు చేస్తామని, రైసుమిల్లర్ల దోపిడిని అరికడతామని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఈర్ల పైడి, సీపీఐ(ఎం) గ్రామ కార్యదర్శి ఎస్కే అన్వర్, పెండ్యాల సారయ్య, నాయకులు మాంకాల శ్రీనివాస్, బస్కె మొగిలి, సర్పంచ్ బానోతు రాము, సొసైటీ డైరెక్టర్ రవీందర్, వార్డు మెంబర్ బూడిది రవి, తదితరులు పాల్గొన్నారు.