Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-నంగునూరు
వడ్లు కొనమంటే.. నూకలు బుక్కమని.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను అవహేళన చేసిందని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామంలో 40వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్, సామూహిక గొర్రెల షెడ్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. షెడ్లలో లబ్దిదారులకు సంప్రదాయ దుస్తులు అందజేశారు. హెల్త్ కిట్లను పంపిణీ చేశారు. గట్లమల్యాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నంగునూరు మండలం వాగు అవతలి గ్రామ ప్రజలకు మేలు చేకూరేలా రోడ్డు వేసి బస్సు తెచ్చారని గుర్తు చేశారు. నేడు దవాఖానా తెచ్చామన్నారు. నంగునూరు నుంచి ఖాతా వరకూ డబుల్ లైన్రోడ్డు వేసుకున్నామన్నారు. విద్యుత్ సబ్ స్టేషన్లు, 7 చెక్ డ్యాములతో నీళ్ల ఊటలు పెరిగాయన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్సీ గట్లమల్యాల గ్రామానికి తెచ్చుకున్నట్టు వివరించారు. ఏఎన్ఏం సబ్ సెంటరులోనే తాత్కాలిక భవనం, శాశ్వత భవనానికి రూ.2 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. ఈ యాసంగిలో కాళేశ్వరం నీళ్లు తెచ్చి నంగునూరు పెద్దవాగులో నింపుతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరును, గట్లమల్యాల గ్రామ అభివృద్ధి పనులు గురించి వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ముజామిల్ ఖాన్, రాష్ట్ర ఆయిల్ ఫామ్ రైతు వెల్ఫేర్ సొసైటీ ఉపాధ్యక్షులు ఎడ్ల సోమిరెడ్డి, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షులు కర్ణ కంటి రేణుక వేణుగోపాల్, జిల్లా వైద్యాధికారి కాశీనాథ్, గ్రామ సర్పంచ్ తిప్పని రమేష్, ఉపసర్పంచ్ ప్రకాశ్ రెడ్డి, సొసైటీ చైర్మెన్ ఎల్లంకి మహిపాల్ రెడ్డి, మండలానికి చెందిన ప్రజా ప్రతినిధులు, రైతు సమన్వయ సమితి జిల్లా, మండల నాయకులు, టిఆర్ఎస్ అనుబంధ సంఘాల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.