Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గులాబీ పార్టీ పేరు మార్పునకు ఎన్నికల సంఘం ఆమోదం
- కేసీఆర్కు అధికారికంగా లేఖ
- నేటి మధ్యాహ్నం 1.20 గంటలకు ఆవిర్భావ కార్యక్రమం
- గుజరాత్ ఫలితాల తర్వాతా వెనక్కు తగ్గని టీఆర్ఎస్ బాస్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)... 21 ఏండ్ల కిందట ఏర్పడి అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ, ఇటు ప్రత్యేక తెలంగాణలోనూ ఇప్పటి వరకూ మనుగడ సాధించిన ఈ పార్టీ శుక్రవారం నుంచి అంతర్థానం కానుంది. దాని స్థానంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పురుడు పోసుకోనున్నది. దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని గులాబీ దళపతి కేసీఆర్ గత కొన్నేండ్ల నుంచి భావిస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చేందుకు వీలుగా కొద్ది నెలల కిందట ఆయన పార్టీ అధ్యక్షుడి హోదాలో కేంద్ర ఎన్నికల సంఘా(ఈసీ)కి దరఖాస్తు సమర్పించిన విషయం విదితమే. ఈ ప్రతిపాదనపై అభ్యంతరాలకు గడువునిచ్చిన ఈసీ... తాజాగా ఎలాంటి అభ్యంతరాల్లేవని భావించి పార్టీ పేరు మార్పునకు ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు కేసీఆర్కు గురువారం అధికారికంగా లేఖ రాసింది.
ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం 1.20 గంటలకు బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమాన్ని హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన కార్యక్రమాలు, ఏర్పాట్లను పూర్తి చేయాలంటూ సీఎం... తమ పార్టీ నేతలను ఆదేశించారు. ఆవిర్భావ కార్యక్రమం సందర్భంగా తనకు ఈసీ నుంచి అధికారికంగా అందిన లేఖకు సమాధానంగా దానిపై కేసీఆర్ సంతకం చేయనున్నారు. ఆ తర్వాత ఆ లేఖను ఈసీకి పంపనున్నారు. అనంతరం ఆయన బీఆర్ఎస్ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.
వాస్తవానికి గుజరాత్ ఫలితాలు చూసిన తర్వాత బీఆర్ఎస్ ప్రకటన నుంచి కేసీఆర్ వెనక్కు తగ్గుతారని అందరూ భావించారు. కానీ ఆయా ఫలితాలతో సంబంధం లేకుండా కారు సారు ఏ మాత్రం వెనకంజ వేయకుండా, వేరే ఏ ఆలోచన లేకుండా ముందుకెళ్లారు. ఒకవైపు ఎమ్మెల్యేల ఎర కేసు, మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాంపై విచారణ కొనసాగుతుండగానే ఆయన బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమానికి ఆదేశాలివ్వటం ఇక్కడ గమనార్హం. దాంతోపాటు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి... రాష్ట్ర విభజన చట్టంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం గులాబీ పార్టీకి లడ్డూలాగా మారిందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ పతాకావిష్కరణ సందర్భంగా కేసీఆర్... ఇటు బీజేపీని, అటు వైసీపీని ఏకిపడేసే అవకాశాలున్నాయి. మరోవైపు డిసెంబరు 9 అనేది టీఆర్ఎస్ శ్రేణులకు ప్రత్యేకమైంది. స్వరాష్ట్ర సాధన కోసం నిరాహార దీక్ష చేపట్టిన కేసీఆర్... అదే రోజు (డిసెంబరు 9, 2009.. కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో) తన దీక్షను విరమించారు. ఆ రోజు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ జన్మదినోత్సవం కావటంతో... తెలంగాణ ఏర్పాటుపై ఆనాటి కేంద్ర హోం మంత్రి చిదంబరం చేత హస్తం పార్టీ ప్రకటన చేయించింది. ఇప్పుడు అదే తేదీన గులాబీ బాస్... బీఆర్ఎస్ ఆవిర్భావ ప్రకటన చేయనుండటం గమనార్హం. వాస్తవానికి జాతీయ స్థాయి రాజకీయాల కోసం బీఆర్ఎస్ను ఏర్పాటు చేస్తున్నామంటూ ఆయన చెప్పుకొస్తున్నా... రాష్ట్ర రాజకీయాల్లో తమకెవరూ ఎదురు లేకుండా చూడటం, తెలంగాణ ప్రయోజనాలను కాపాడటమే పరమావధిగా అది పని చేస్తుందని తెలంగాణ భవన్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సీఎం పీఠాన్ని కట్టబెట్టనున్నారనే ఊహాగానాలు ఎప్పటి నుంచో వెలువడుతున్నా... కేసీఆరే ఆ పదవిలో ఉంటారనీ, అలా ఉంటూనే బీఆర్ఎస్ వ్యవహారాలను చక్కబెడతారని ఆయా వర్గాలు వివరించాయి. ఏదైమైనా గురువారం గుజరాత్ ఫలితాలు వెలువడటం, ఆ వెంటనే 'విభజన'పై సజ్జల కామెంట్లు చేయటం, కొన్ని గంటల వ్యవధిలోనే వాటిని ఎమ్మెల్సీ పల్లా ఖండించటం, ఆ తర్వాత బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమ వివరాలు సమయం, మూహుర్తంతో సహా ఒకదాని వెంట ఒకటి వెలువడటం యాదృశ్చికమా..?లేక కాకతాళీయమా..? అనే చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్కు ఈసీ ఆమోదముద్రపై 'బాస్'కు ముందుగానే క్లారిటీ ఉందనే అభిప్రాయానికి ఇవన్నీ బలం చేకూరుస్తు న్నాయి. అందుకే ఈసీ నుంచి ఆమోదం రాగానే ముహూర్తాన్ని, సమ యాన్ని క్షణాల్లో ఆయన ప్రకటించారనే వాదన కూడా వినబడుతున్నది. ఈ వాదనలు, చర్చలు ఇలా కొనసాగుతుండగానే శుక్రవారం నాటి బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమానికి హాజరు కావాలంటూ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లాల అధ్యక్షులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ, కార్పొరేషన్ చైర్పర్సన్లు, డీసీసీబీ, డీసీఎమ్ఎస్ అధ్యక్షులందరూ హాజరు కావాలంటూ కేసీఆర్ ఆదేశించటం గమనార్హం.