Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాల్గొననున్న సీఎం కేసీఆర్
- ట్రైన్ డోర్ ఓపెన్‌తోనే.. ఫ్లాట్‌ఫామ్ స్క్రీన్ డోర్స్ ఓపెన్
- అందుకు అత్యాధునిక టెక్నాలజీని తీసుకువస్తున్నాం
- మెట్రో ఫేజ్-1 విజయవంతంగా పూర్తిచేశాం :
- మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఎయిర్‌పోర్టు మెట్రోకు నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నట్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో ట్రైన్ డోర్ ఓపెన్‌తోనే.. ఫ్లాట్ ఫామ్ స్క్రీన్ డోర్స్ తెరుచుకునే అత్యాధునిక టెక్నాలజీని ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ మెట్రోలో ఉపయోగించనున్నామని తెలిపారు. గురువారం బేగంపేట్‌లోని హైదరాబాద్ మెట్రో రైల్ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెట్రో ఫేజ్ 1 విజయవంతంగా పూర్తి చేశామన్నారు. మెట్రో అందుబాటులోకి వచ్చిన ఈ ఐదేండ్ల కాలంలో 31కోట్ల 50 లక్షల మంది మెట్రోలో ప్రయాణించారన్నారు. దాంతో 9.2 కోట్ల లీటర్ల పెట్రోల్, డీజిల్ ఆదా అయ్యిందని తెలిపారు. 3,834 కిలోమీటర్లు ఇప్పటి వరకు మెట్రో తిరిగిందని చెప్పారు. రెండో దశ మెట్రో విస్తరణకు సంబంధించి కేంద్రానికి రెండు డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్‌లు) పంపామని, వారి నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. డీపీఆర్‌ను బయటకు ఇస్తే వివిధ కారణాలతో కేసులై పనులు జరగడం లేదని.. ఈ కారణంగా డీపీఆర్‌ను బయటికి ఇవ్వకుండా కేంద్రానికి పంపినట్టు చెప్పారు.
ఎయిర్‌పోర్టు మెట్రో మూడేండ్లలో పూర్తి
సిటీ మెట్రోకి ఎన్నో అడ్డంకులు వచ్చాయని, ఎయిర్పోర్ట్ మెట్రోకు అలాంటివి లేకపోవడంతో రూ.6,250 కోట్లతో రాయదుర్గ్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు నిర్మిస్తున్నామని, ఇందుకు అయ్యే మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని వెల్లడించారు. మైండ్‌స్పేస్ వద్ద ప్రారంభమయ్యే లైన్.. ఎయిర్‌పోర్టు వరకు 31 కిలోమీటర్లు నిర్మించనున్నట్టు చెప్పారు. నగర మెట్రోతో పోల్చి చూస్తే శంషాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రోలో ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉన్నాయన్నారు. స్పీడ్ లిమిట్ ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రస్తుతం సిటీలో 80 కిలోమీటర్ల మాగ్జిమమ్ స్పీడు ఉంటే ఎయిర్ పోర్ట్ మెట్రో 120 కిలోమీటర్ల హై స్పీడ్‌తో వెళ్తుందని చెప్పారు. 31 కిలోమీటర్ల ఎయిర్పోర్ట్ మార్గంలో రైలు 26 నిమిషాల్లో చేరుకుంటుందని, ఈ రూట్లో 8 లేదా 9 స్టేషన్లు ఉండొచ్చని అంచనా వేసినట్టు తెలిపారు. ఆరు కోచ్‌లకు ప్లాట్ ఫామ్ డిజైన్ చేస్తున్నామని, ఎయిర్‌పోర్టుకు రద్దీ సమయంలో 8 నిమిషాలకు, నాన్ పీక్ టైంలో 20 నిమిషాలకు మెట్రో ఉంటుందని, రానున్న రోజుల్లో 2.5, 5 నిమిషాలకు తీసుకువస్తామన్నారు. మెట్రోపై సీఎం ఒక విజన్‌తో ఉన్నారన్నారు. అలాగే, ఎంఎంటీఎస్ రెండో దశను కూడా చేయాలని సీఎం అన్నారని, హయత్‌నగర్ వరకూ మెట్రో ఉండాలని మంత్రి కేటీఆర్ చెప్పారని గుర్తుచేశారు. బీహెచ్ఈఎల్ నుంచి లక్డికాపూల్ పర్మిషన్ కోసం ఎదురుచూస్తున్నామని, అనుమతి వచ్చిన వెంటనే మెట్రో ప్రారంభిస్తామన్నారు.
మెట్రో వెళ్లే రూట్ ఇలా..
శంషాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో నిర్మాణానికి సంబంధించి ప్రస్తుతం ఉన్న రాయదుర్గ్ స్టేషన్ నుంచి 0.9 కి.మీ ముందుకు తీసుకుపోతామని తెలిపారు. ఎల్అండ్టీకి ప్రభుత్వం ఇచ్చిన భూమి అరబిందో బిల్డింగ్ వరకు వస్తుందన్నారు. బయో డైవర్సిటీ రెండు ఫ్లై ఓవర్లపై మెట్రో వస్తుందని తెలిపారు. ఓరియన్ విల్లా రోడా మేస్త్రి మధ్యలో నుంచి వెళ్తుందని, ఖాజాగుడా నుంచి కుడి వైపు తీసుకుని నానక్‌రామ్ గూడ వెళ్తామని చెప్పారు. అక్కడ నుంచి ఎడమ వైపునకు ఓఆర్ఆర్ వైపు వెళ్తుందని, సిటీ వైపు సర్వీస్ రోడ్ నుంచి మెట్రో వెళ్తుందని తెలిపారు. మొత్తం 31 కిలోమీటర్ల మెట్రో మార్గంలో.. 27.5కిలో మీటర్లు ఎలివేటెడ్ కారిడార్‌లో వెళ్తుండగా..1 కిలోమీటరు రోడ్ లెవల్లో.. 2.5 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్లో మెట్రో ఉంటుందన్నారు. ఎయిర్‌పోర్టు వద్ద అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ ఉంటుందని, ఎలివేటర్, మెట్ల మార్గం గుండా విమానాశ్రయంలోకి వెళ్లవచ్చని తెలిపారు. చెక్ ఇన్, లగేజ్ చెక్ ఇన్ను రాయదుర్గంలో చేసే విధంగా చూస్తున్నామని తెలిపారు. అలాగే విమానాల సమాచారం ఇందులో అందుబాటులో ఉంటుందన్నారు.