Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటి వద్ద నుంచే పార్శిల్ రవాణా సేవలు ఉపయోగించుకునే అవకాశముందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, తపాలశాఖ తెలంగాణ రీజియన్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కె.ప్రకాష్ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ డివిజనల్ హెడ్ క్వార్టర్స్ సంచాలన్ భవన్లో పార్శిల్ సరుకు రవాణా వినియోగదారులతో సమావేశం నిర్వహించారు. రైల్వే బోర్డు స్ట్రాటజిక్ ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జీ.వీ.ఎల్.సత్యకుమార్‌తో కలిసి వారు పార్శిల్ రవాణా నూతన విధానం గురించి వివరించారు. రైల్వే, తపాలశాఖ సంయుక్త సేవల ద్వారా వినియోగదారులు తామున్న చోటి నుంచి గమ్యస్థానానికి పార్శిళ్లు పంపించుకునే వీలు కలిగిందని తెలిపారు. అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ రైల్వేలు 7,000 స్టేషన్లు, తపాలాశాఖ దాదాపు 1.5 లక్షల పోస్టాఫీసులతో దేశంలోని అన్ని ప్రాంతాలకు ఈ సేవలను అందిస్తాయని చెప్పారు. ఈ సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ జి.జాన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.