Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సీ హౌదా కల్పించకుంటే పెద్ద ఎత్తున నిరసనలు: మేడే రాజీవ్ సాగర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దళిత క్రైస్తవులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపిస్తున్నదని తెలంగాణ ఫుడ్స్ చైర్మెన్ మేడే రాజీవ్ సాగర్ విమర్శించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హౌదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలపడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత క్రైస్తవులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగడం ఇష్టం లేకనే బీజేపీ సర్కార్ కుట్రలు చేస్తున్నదని తెలిపారు. ఎస్సీ హౌదాను వ్యతిరేకిస్తే బీజేపీ సర్కార్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రాజ్యాంగంలో ప్రజలకు వారికిష్టమైన మతాన్ని విశ్వసించే స్వేచ్ఛ ఉందనీ, ఆ మేరకు క్రైస్తవ మతంలోకి మారిన దళితులకు కూడా ఎస్సీ రిజర్వేషన్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. 2004లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రంగనాథ్ మిశ్రా కమీషన్ ఎస్సీ హౌదాకు మతంతో సంబంధం లేదని సిఫార్సు చేసిందని గుర్తుచేశారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేకనే కేంద్ర సర్కార్ ఆ కమిటీ నివేదికలో తప్పులున్నాయని సుప్రీం కోర్టుకు చెప్పిందని తప్పుపట్టారు. జస్టిస్ రాజేందర్ సచార్ కమిషన్ సైతం ఎస్సీ హౌదా కల్పించాలని సిఫారసు చేసిందని తెలిపారు. 2008లో సామాజిక వేత్త సతీశ్ దేశ్ పాండే దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని చెప్పారనీ, జాతీయ ఎస్సీ కమిషన్ కూడా ఈ మేరకు సిఫారసు చేసిందని గుర్తుచేశారు. సరైన గణాంకాలు లేవంటూ ఈ సిఫారసులను తోసిపుచ్చడం కుట్రేనని తెలిపారు. దళితులు మతం మారితే దళితులుగా గుర్తించలేమనే తీర్పు... దళితుల హక్కులకు శరాఘాతమని తెలిపారు.