Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రేగొండ
ప్రమాదవశాత్తు కుంటలో పడి ఇద్దరు బాలురు మృతి చెందిన సంఘటన జయశంకర్-భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం దుంపిల్లపల్లి గ్రామంలో గురువారం జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుంపిల్లపల్లి గ్రామానికి చెందిన తాటికంటి రమేష్ అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. కాగా, మృతుని భార్య సునీత అక్క కమలాపూర్ మండలం గుండేడు గ్రామానికి చెందిన నాంపల్లి రాణి, కోటేశ్వర్లు కుమారుడు పరశురాం (13), మొగులపల్లి మండలానికి చెందిన చెల్లెలు భాగ్యలక్ష్మి, బావ గుండారపు సురేశ్ కుమారుడు వర్షిత్ (8) ఇద్దరూ కలిసి బహిర్భూమి నిమిత్తం గ్రామంలోని చందునాయక్ కుంట సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు ఇద్దరూ కాలుజారి కుంటలో పడిపోయారు. ఎవరూ గమనించకపోవడంతో నీటిలో మునిగి పోయారు. చాలా సేపటి వరకు పిల్లలు కనిపించకపోవడంతో వారి తల్లిదండ్రులు గ్రామంలో వెతికినా ఆచూకీ తెలియలేదు. చివరికి కుంటలో పడి ఉంటారనే అనుమానంతో జాలర్లతో వెతికించగా.. ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. చిన్న వయసులోనే ఇద్దరు బాలురు మృతిచెందడంతో ఆగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, పరశురాం 6వ తరగతి, వర్షిత్ రెండవ తరగతి చదువుతున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ ననిగంటి శ్రీకాంత్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.