Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేసులో రవి గుప్తా, సీవీ ఆనంద్ కూడా..
- ఈనెల చివరన మహేందర్‌రెడ్డి రిటైర్మెంట్
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర డీజీపీ ఎం. మహేందర్‌రెడ్డి డిసెంబర్ 31న పదవీ విరమణ చేస్తుండటంతో పోలీసు శాఖకు కొత్త బాస్ ఎవరు? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా, ఈ సారి పోలీసు శాఖ చీఫ్ ఎంపికలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తనదైన శైలిలో ఎంపిక చేయనున్నారనే ఊహాగానాలు పోలీసు శాఖలో సాగుతున్నాయి. అయితే, డీజీపీగా నియమించబోయే సీనియర్ ఐపీఎస్ అధికారుల వరుసలో సీనియర్ అయిన రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ అంజనీ కుమార్ పేరు మొదటి స్థానంలో ఉన్నట్టు తెలిసింది. 1990 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన అంజనీకుమార్.. పోలీసు శాఖలో పలు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి మంచి పేరును సాధించారు. ముఖ్యంగా, రాష్ట్ర శాంతి భద్రతల విభాగం అదనపు డీజీగా, నగర పోలీసు కమిషనరుగా దీర్ఘకాలం కొనసాగి శాంతి, భద్రతల సమస్య తలెత్తిన పలు సందర్భాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొని మంచి ఫలితాలు సాధించిన అధికారిగా ఆయనకు గుర్తింపు ఉన్నది. ఈ నేపథ్యంలో మహేందర్‌రెడ్డి తర్వాత అంజనీ కుమార్‌కే రాష్ట్ర పోలీసు శాఖ పగ్గాలు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తున్నది. అయితే, మరోపక్క రాష్ట్ర స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) డీజీపీ, 1989 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఉమేశ్ ష్రాఫ్ అంజనీకుమార్ కంటే సీనియర్ అయినప్పటికీ.. శాంతి, భద్రతల విభాగంలో పని చేసిన అనుభవం తక్కువగా ఉన్న కారణంగా ఆయనకు డీజీపీ పదవి దక్కే అవకాశాలు తక్కువేనని ఐపీఎస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అదే సమయంలో ఒకవేళ ఏ కారణం చేతనైనా అంజనీకుమార్‌కు డీజీపీ పోస్టు దక్కని పక్షంలో రాష్ట్ర హౌం శాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్. రవి గుప్తా, నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పేర్లు పరిశీలనలోకి వచ్చే అవకాశాలు న్నాయని తెలుస్తోంది. డాక్టర్ రవి గుప్తా 1990 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి కాగా, సీవీ ఆనంద్ 1991 బ్యాచ్‌కు ఐపీఎస్ అధికారి. ఇందులో రవిగుప్తా డీజీపీ హౌదాలో ఉండగా, ఆనంద్ అదనపు డీజీ స్థాయి హౌదాలో ఉన్నారు. సర్వీసు పరంగా చూస్తే అంజనీ కుమార్‌కు మరో నాలుగేండ్లు, రవి గుప్తాకు మూడేండ్లు, ఆనంద్‌కు ఆరేండ్ల పాటు సర్వీసు ఉన్నది. మొత్తమ్మీద ఈ సారి నూతన డీజీపీ ఎంపికపై ఐపీఎస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొని ఉన్నది. కాగా, పదవీ విరమణ చేస్తున్న మహేందర్‌రెడ్డి సర్వీసులను తాము తప్పకుండా ఉపయోగించుకుంటామని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఆయనకు సైబర్‌క్రైమ్ అంశంపై సీఎం ప్రత్యేక సలహాదారుగా నియమించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే రాష్ట్ర సీఐడీ డీజీ గోవింద్ సింగ్ పదవీ విరమణ చేయటంతో ఆయన పోస్టు ఖాళీ కాగా, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సైతం ఖాళీగా ఉండి ఏసీబీ డీజీ పర్యవేక్షణలో కొనసాగుతున్నది. మరోపక్క, రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ దాదాపు ఆరేండ్లుగా ఆ పోస్టులో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త డీజీపీ ఎంపికతో పాటు పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ కూడా భారీ ఎత్తున సాగనున్నాయని తెలుస్తున్నది. వచ్చే ఏడాది రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశమున్నందున పలువురు ఎస్పీల బదిలీలు సైతం జరిగే అవకాశాలున్నట్టు ఐపీఎస్ వర్గాలను బట్టి తెలుస్తోంది.