Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తీర్పు వాయిదా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ జాతీయ నాయకుడు బీఎల్ సంతోష్, బీడీజేఎస్ అధ్యక్షులు తుషార్, కేరళ డాక్టర్ జగ్గు స్వామి, కరీంనగర్ న్యాయవాది బి. శ్రీనివాస్‌లను నిందితులుగా ప్రతిపాదిస్తూ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టేయడాన్ని సవాల్ చేస్తూ సిట్ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పును తర్వాత వెలువరిస్తామని న్యాయమూర్తి జస్టిస్ డి.నాగార్జున ప్రకటించారు. సిట్ తరఫున అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ వాదిస్తూ, 'ఏసీబీ కోర్టు తన పరిధిని దాటి మెమోను రద్దు చేసింది. ఏసీబీ కోర్టు ఉత్తర్వులు చట్ట వ్యతిరేకమని ప్రకటించి వాటిని తక్షణమే రద్దు చేయాలి. లేకపోతే ఇతర క్రిమినల్ కేసుల్లో కూడా తీరని అన్యాయం జరుగుతుంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వ్యవహారం సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఉంది. ఏ కోర్టుల్లోనూ సిట్ దర్యాప్తును అడ్డుకునేందుకు ఉత్తర్వులు ఇవ్వలేదు. ఏసీబీ కోర్టు మాత్రం తన ముందున్న మెమోలో ఏ అభ్యర్థన లేకపోయినా రద్దు చేసింది. మెమో అనేది కేవలం సిట్ తెలియజేసే సమాచారం మాత్రమే. అయినా ఆర్డర్ ఇచ్చేసి చట్ట వ్యతిరేకంగా చేసింది. నలుగురిని నిందితులుగా ప్రతిపాదిస్తూ మెమో దాఖలు చేస్తే దానిని ఏసీబీ కోర్టు కొట్టేయడం చెల్లదు. అసాధారణ పరిస్థితుల్లో మినహా, హైకోర్టు, సుప్రీంకోర్టులే దర్యాప్తులను అడ్డుకోవు. సిట్ దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేసే వరకు ఏసీబీ కోర్టు జోక్యానికి ఆస్కారం ఉండదు. ఏసీబీ కోర్టు ఉత్తర్వులు విస్మయానికి గురిచేస్తున్నాయి...'' అని వాదించారు. శ్రీనివాస్ తరఫున సీనియర్ న్యాయవాది ఎన్.రామచందర్‌రావు. రామచంద్రభారతి తరఫున మరో సీనియర్ న్యాయవాది రవిచందర్‌లు ఎజి వాదనలను వ్యతిరేకించారు. 41ఎ నోటీసులను ప్రతిపాదిత నిందితులు హైకోర్టులో సవాల్ చేసి మధ్యంతర ఆర్డర్ పొందారని, ఒకవేళ హైకోర్టు అనుకూలంగా ఉత్తర్వులు ఇస్తే సిట్ మెమో నిర్వీర్యం అవుతుందన్నారు. హైకోర్టులో కేసులు ఉండగా మెమో దాఖలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఏసీబీ కోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఫిర్యాదు చేసిన రోహిత్‌రెడ్డిపై అనేక కేసులున్నాయనీ, ఆయన ఫిర్యాదుకు విశ్వాసనీయత ఉండదన్నారు. ఏసీబీ కోర్టు ఉత్తర్వులను సమర్ధించాలన్నారు. బీజేపీ అగ్రనేతలను అరెస్టు చేయడమే లక్ష్యంగా సిట్దర్యాప్తు జరుగుతోందనీ, ఏకపక్షంగా దర్యాప్తు ఉందన్నారు. వాదనల అనంతరం హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.