Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విభజన చట్టంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల అసందర్భ వ్యాఖ్యలు
- అవి విషం చిమ్మే మాటలంటూ టీఆర్ఎస్ ఖండన
- కేఏ పాల్, షర్మిల మోడీ వదిలిన బాణాలు : ఎమ్మెల్సీ పల్లా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'తల్లిని చంపి బిడ్డను వేరు చేశారు.. పార్లమెంటు తలుపులను మూసేసి ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టాన్ని తెచ్చారు...' అంటూ తెలంగాణపై పదే పదే అక్కసును వెళ్లగక్కే ప్రధాని మోడీ... ఇప్పుడు మరో కుట్రకు తెరలేపారా..? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇటీవల ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి ఢిల్లీలో ప్రధానితో భేటీ కావటం.. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అదే విభజన చట్టంపై అసందర్భ వ్యాఖ్యలు చేయటం వారి వాదనలకు బలం చేకూరుస్తున్నది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పబ్బం గడుపుకునేందుకు వీలుగా బీజేపీ అగ్రనేతలే వైసీపీ నాయకులతో ఇలాంటి మాటలను మాట్లాడిస్తు న్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఏడాది తెలంగాణ శాసనసభకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలో ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకు రావటం ద్వారా ప్రజా సమస్యలను, అసలు విషయాలను పక్కదోవ పట్టించేందుకే కమలం పార్టీ ఇలాంటి కుయుక్తులకు పాల్పడుతున్నదని టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. 'విభజన చట్టం అసంబద్ధమంటూ సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది.. కుదిరితే మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాలను ఉమ్మడిగా కలపాలి. అదే వైసీపీ విధానం...' అంటూ సజ్జల గురువారం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తొలి నుంచి వైపీసీ పోరాటం చేస్తోందంటూ ఆయన చెప్పటం వివాదాస్పదమైంది. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే తొలుత స్వాగతించేది తమ పార్టీయే అంటూ ఆయన మాట్లాడటం వెనుక బీజేపీ స్కెచ్ దాగుందంటూ గులాబీ పార్టీ ఆగ్రహిస్తోంది. ఆ పార్టీ ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి... సజ్జల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్లోని టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సజ్జల వ్యాఖ్యల వెనుక మోడీ కుట్ర దాగుందంటూ విమర్శించారు. ప్రధాని దన్నుతోనే గతంలో చంద్రబాబు, ఇప్పుడు సజ్జల మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేక మోడీ తెలంగాణలో అనేక బాణాలు వదులుతున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ షర్మిల, కేఏ పాల్, బండి సంజరుతోపాటు మరికొందరు ఆయా బాణాల కోవలోకే వస్తారంటూ విమర్శించారు. బీజేపీ విసిరే బొక్కలకు ఆశపడి కొందరు తెలంగాణపై విషం చిమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీతో భేటీ సందర్భంగా ఏమేం మాట్లాడాలనే అంశంపై షర్మిలకు... గవర్నర్ తమిళిసై శిక్షణనిస్తున్నారని తెలిపారు. తెలంగాణ, ఏపీ కలయిక ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని ఆయన నొక్కి చెప్పారు. ఇక్కడున్న శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టేందుకు బీజేపీ అనేక కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నదని పల్లా ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. అందులో భాగమే సజ్జల వ్యాఖ్యలంటూ విమర్శించారు. మరోవైపు కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క సైతం సజ్జల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. శుక్రవారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావాన్ని ప్రకటించే సందర్భంలో సీఎం కేసీఆర్ ఈ పరిణామాలపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.