Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫార్ములా రేసుకు చకాచకా ఏర్పాట్లు
- నగరానికి చేరుకున్న ఐఆర్ఎల్ రేసు కార్లు
- డిసెంబర్ 10, 11న స్ట్రీట్ సర్క్యూట్ ఫైనల్
నవతెలంగాణ-హైదరాబాద్ : ఫార్ములా కిక్కు రెండో డోస్‌కు రంగం సిద్దమవుతోంది. నవంబర్ 20న తొలి అంచె పోటీలు అనూహ్య ప్రమాదం కారణంగా రద్దుగా ముగిశాయి. ఫార్ములా రేసు అభిమానుల కోసం ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్) స్ట్రీట్ సర్క్యూట్ మళ్లీ నగరానికి రానుంది. ఈ నెల 10, 11న హుస్సేన్‌సాగర్ తీరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాక్‌పై ఐఆర్ఎల్ స్ట్రీట్ సర్క్యూట్ తుది పోటీలు జరుగనున్నాయి. ఇందుకోసం అధికారులు, నిర్వాహకులు షర వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి దశ పోటీల సందర్భంగా ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పకడ్బందిగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మరింత మెరుగ్గా ట్రాక్ : వచ్చే ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ వేదికగా ప్రతిష్టాత్మక ఫార్ములా ఈ రేసు జరుగనుంది. ఫార్ములా ఈ రేసుకు ఐఆర్ఎల్ స్ట్రీట్ సర్క్యూట్ సన్నాహాక రేసుగా పరిగణించవచ్చు. ఈ రేసు కోసం రాష్ట్ర ప్రభుత్వం 2.7 కిలోమీటర్ల ప్రత్యేక ట్రాక్ సిద్ధం చేసింది. సాగర తీరంలో ట్రాక్‌లో ఎక్కువ టర్న్‌లు ఉండటం, ట్రాక్‌పై డ్రైవర్లకు అవగాహన లేకపోవటంతో నవంబర్ 20న జరగాల్సిన స్ట్రీట్ సర్క్యూట్ తొలి మూడు రౌండ్ల పోటీలు అర్థాంతరంగా రద్దు చేశారు. ఐఆర్ఎల్ సాంకేతిక బృందం సూచించిన మార్పుల మేరకు 2.7 కిలోమీటర్ల ట్రాక్‌లో పలు మార్పులు చేసినట్టు తెలుస్తోంది. ఇక గతంలో ఓ కారుపై చెట్టు కొమ్మ విరిగిపడిన నేపథ్యంలో.. ఈ మార్గంలో ఉన్న చెట్ల కొమ్మలను దాదాపుగా తొలగించారు.
రేసు కార్లు వచ్చేశారు : శని, ఆదివారాల్లో జరుగనున్న ఫైనల్ చాంపియన్‌షిప్ కోసం ఆరు జట్ల రేసు కార్లు నగరానికి చేరుకున్నాయి. ఇటలీ కంపెనీ తయారు చేసిన రేసు కార్లను స్ట్రీట్ సర్క్యూట్లో వినియోగిస్తున్నారు. రేసుకు రెండు రోజుల ముందుగానే కార్లు చేరుకోవటంతో.. నేడు ఆరు జట్ల డ్రైవర్లు ట్రాక్‌పై ప్రాక్టీస్ చేసేందుకు అవకాశం ఉంది.
తమన్ సంగీత కచేరీ : ఆదివారం ఐఆర్ఎల్ స్ట్రీట్ సర్క్యూట్ ఫైనల్స్ నేపథ్యంలో నిర్వాహకులు సంగీత కచేరీ ఏర్పాటు చేశారు. పోటీలు ముగింపు, బహుమతి ప్రధానం మధ్యలో సినీ సంగీత దర్శకుడు ఎస్.ఎస్ తమన్ సంగీత కచేరీ నిర్వహించనున్నాడు. డ్రమ్స్ శివమణి, ఫ్లూట్ నవీన్ కుమార్‌లు సైతం ప్రత్యేక ప్రదర్శన చేయనున్నారు. ఈ మేరకు రేసు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఐఆర్ఎల్ స్ట్రీట్ సర్క్యూట్ పోటీల టికెట్లను బుక్‌మైషో వెబ్సైట్ నుంచి పొందవచ్చు.