Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో మిగులు విద్యుత్ 13,441 మి.యూ.,
- త్వరలో కొత్త ఉత్పత్తి కేంద్రాలు అందుబాటులోకి...
- ప్రార్థనా మందిరాలకు యూనిట్ రూ.5
- 2023-24 ఏఆర్‌ఆర్‌లో డిస్కంల వెల్లడి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ వినియోగం తగ్గుతున్నది. సకాలంలో వర్షాలు కురవడం, సాగునీటి ప్రాజెక్టులు దాదాపు పూర్తికావడం, పంటపొలాలకు కాలువల ద్వారా నీరు చేరుతుండటంతో బోర్ల వాడకం తగ్గినట్టు తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) వెల్లడించాయి. 2023-24 వార్షిక ఆదాయ అవసరాల ప్రతిపాదనల్లో (ఏఆర్ఆర్) లో ఈ విషయాన్ని పేర్కొన్నాయి. నవంబర్ 30వ తేదీ ఏఆర్ఆర్లను డిస్కంలు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ)కి సమర్పించిన విషయం తెలిసిందే. 2021-22లో ఎల్టీ అగ్రికల్చరల్ అమ్మకాలు 11,724 మిలియన్ యూనిట్లు (25.05 శాతం) ఉండగా, 2022-23లో 11,032 మి.యూ., (21.50 శాతం)కు తగ్గాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24)లో వ్యవసాయ విద్యుత్ వినియోగం 10,591 మి.యూ., (18.64 శాతం) మాత్రమే ఉంటుందని అంచనా వేశారు. ఈ తగ్గుదలకు పై కారణాల ను పేర్కొన్నారు.
అలాగే కొత్త విద్యు త్కేంద్రాలు అందుబాటులోకి వస్తున్నం దున 2023-24లో 13,441 మి. యూ., మిగులు విద్యుత్ ఉంటుందని కూడా అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022-23) 5,146 మి.యూ., మిగులు విద్యుత్ ఉంటుం దని పేర్కొన్న విషయం తెలిసిందే. అలాగే ఎల్టీ కేటగిరిలో విద్యుత్ అమ్మకాల ద్వారా రూ.11,254.5 కోట్లు, హెచ్‌టీ కేటగిరి ద్వారా రూ.22,266.76 కోట్లు...మొత్తం రూ.33,521.34 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు.
కొత్త విద్యుత్కేంద్రాల అందుబాటు ఇలా..
- యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ 1 యూనిట్ (800 మెగావాట్లు) 2023 డిసెంబర్ 1నాటికి అందుబాటులో వస్తుందని అంచనా.
- ఇక్కడి మరో 800 మెగావాట్ల సామర్ధ్యం కలిగిని రెండో యూనిట్ 2024 ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి వస్తుందని డిస్కంలు భావిస్తున్నాయి.
-తెలంగాణ ఎస్టీపీపీ (2.680) తొలి యూనిట్ 2023 జనవరి 1 నాటికీ, రెండో యూనిట్ 2023 జులై 1వ తేదీ నాటికి అందు బాటులోకి వస్తాయని అంచనా వేశారు.
-ఎన్టీపీసీ నుంచి బ్యాలెన్స్ కేపా సిటీ 396 మెగావాట్ల (వాటా) విద్యుత్ ఈ ఏడాది అక్టోబర్ నుంచే అందు బాటులోకి వచ్చినట్టు పేర్కొన్నారు.
- ఎన్టీపీసీ నుంచి మరో 735 మెగావాట్ల (వాటా) కరెంటు 2023 ఏప్రిల్ నాటికి అందుబాటులోకి వస్తుందని అంచనా వేశారు.
- ఎస్ఈసీఐ వెయ్యి మెగావాట్లు 2023 ఏప్రిల్ 1 నాటికి అందు బాటులోకి వస్తుందని అంచనా.
- మధ్యంతర విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా పీటీసీ ఇండియా లిమిటెడ్ నుంచి ఆరు నెలల కాలానికి సంబంధించి 550 మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
- 2023-24లో మొత్తం విద్యుత్ అవసరాలు 83,113 మి.యూ., విద్యుత్ లభ్యత 96,554 మి.యూ., మిగులు విద్యుత్ 13,441 మి.యూ., గా అంచనా వేశారు.
ప్రార్థనా మందిరాలకు విద్యుత్ సరఫరాపై పలు వివాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎల్టీ-6బీ కేటగిరిలో అన్ని ప్రార్థనా మందిరాలకు 2 కిలోవాట్ల లోపు లోడ్ వినియోగానికి యూనిట్ రేటు రూ.6.40 పైసలుగా ఉండేది.
2 కిలోవాట్ల కంటే ఎక్కువ లోడ్ వినియోగిస్తే యూనిట్ రేటు రూ.7గా ఉండేది. ఇప్పుడు ఇవన్నీ రద్దు చేసి, వాటి స్థానంలో యూనిట్‌కు రూ.5 చొప్పున ప్రతిపాదించారు. టీఎస్ జెన్కో థర్మల్ స్టేషన్ల ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్‌ను 70 నుంచి 76 శాతంగా అంచనా వేశారు.