Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈనెలలోపు మండలానికి రెండు స్కూళ్లను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయండి : జిల్లా కలెక్టర్లకు మంత్రి సబిత ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఈనెలలోపు ప్రతి మండలంలో రెండు చొప్పున 1,210 పాఠశాలలను 'మన ఊరు-మనబడి' కార్యక్రమానికి సంబంధిం చిన పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్ట ర్లను విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. వాటిని ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని కోరారు. 'మన ఊరు-మనబడి' కార్యక్రమంలో చేపట్టిన పనుల పురోగతిపై గురువారం జిల్లా కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని చెప్పారు. మొదటి దశ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్లను ఆమె ఆదేశించారు.
ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 'మన ఊరు-మన బడి' కార్యక్రమానికి రూ.7,289 కోట్లను కేటాయించామని గుర్తు చేశారు. మొదటి దశలో భాగంగా 9,123 పాఠశాలలకు 12 రకాల మౌలిక సదుపాయల కల్పనకు రూ.3,497 కోట్లను కేటాయించామని మంత్రి వివరించారు. పనులను వేగవంతం చేయాలని కోరారు. వాటిని పర్యవేక్షిస్తున్న ఏజెన్సీలతోను, పాఠశాల యాజమాన్య కమిటీలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. పనులు వేగవంతమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నెలలోనే రాష్ట్ర వ్యాప్తంగా 1210 పాఠశాలల్లో పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు. వాటికి వెంటనే డ్యూయల్ డెస్క్‌లను అందజేయాలని అధికారులను ఆదేశించారు. వాటిలో గ్రంథాలయాలను, ఆట స్థలాలను సిద్ధం చేయాలని సూచించారు. పాఠశాలలకు విడుదల చేసిన స్కూల్, స్పోర్ట్స్ గ్రాంట్లను వినియోగించుకునేందుకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేశామన్నామరు.
వాటిని సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు మంత్రి సూచించారు. పనులు పూర్తి చేసుకున్న ఉన్నత పాఠశాలలకు వెంటనే డైనింగ్ హాల్ ఫర్నిచర్‌ను అందజేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను ఆమె ఆదేశించారు. 200 మంది విద్యార్థులకన్నా ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మెన్ శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.