Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆకట్టుకునేలా ఆర్చీలు, జెండాలు, తోరణాలు
- ప్రత్యేక ఆకర్షణగా అమరవీరుల స్తూపం
- ఆర్కిటెక్చర్ విద్యార్థుల సహాయంతో రూపకల్పన
- ప్రతినిధుల కోసం 'ఐ లవ్ ఎస్ఎఫ్ఐ' సెల్ఫీ పాయింట్
- ఘనంగా 17వ అఖిల భారత మహాసభల ఏర్పాట్లు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) అఖిల భారత 17వ మహాసభలకు వేదికైన ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ)లోని ఠాగూర్ ఆడిటోరియాన్ని అందరూ అబ్బురపడేలా అలంకరణ చేస్తున్నారు. మల్లు స్వరాజ్యం నగర్, అభిమన్యు, ధీరజ్, అనీష్ఖాన్ ప్రాంగణంలో ఈ మహాసభలు ఈనెల 13 నుంచి 16 వరకు జరగనున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతినిధులను ఆకట్టుకునేలా ఆహ్వాన సంఘం నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం ఆర్చీలు, జెండాలు, తోరణాలు, ఫ్లెక్సీలతో అలంకరిస్తున్నారు. భగత్‌సింగ్, చేగువేరా, కెప్టెన్ లక్ష్మీసెహగల్, సమ్మక్క సారక్క, ఎస్ఎఫ్ఐ ఓయూ మాజీ నాయకులు జనార్ధన్ పేరుతో ఐదు స్వాగత ద్వారాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక ఆకర్షణగా అమరవీరుల స్తూపాన్ని ఆర్కిటెక్చర్ విద్యార్థులు రూపకల్పన చేస్తున్నారు. రెండు చేతుల మధ్యలో అమర వీరుల స్తూపం దానిపైన పుస్తకం, పెన్ను ఆపైన పిడికిలి ఎత్తిన చెయ్యి ఉండేలా ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. జెండావిష్కరణతోపాటు అమరవీరుల స్తూపం, నాయకులు నిలబడడంతోపాటు, వరుసక్రమంలో ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతినిధులు వ17వ మహాసభలకు సూచికగా ఠాగూర్ ఆడిటోరియంపైన 17 ఎస్ఎఫ్ఐ జెండాలను రెపరెపలాడేలా ఏర్పాటు చేస్తున్నారు. వాటి మధ్యలో ఎస్ఎఫ్ఐ మహాసభల లోగో ఉండనుంది. ఠాగూర్ ఆడిటోరియం జిగేల్మనేలా రంగురంగుల లైట్లను అమర్చుతున్నారు. దూరం నుంచి చూసినా అద్భుతంగా కనిపించేలా అలంకరిస్తున్నారు.
ట్రెండ్‌కు తగ్గట్టుగా...
ఎస్ఎఫ్ఐ అఖిల భారత 17వ మహాసభలకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో విద్యార్థుల్లో వస్తున్న మార్పులకనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రెండ్‌కు తగ్గట్టుగా ప్రతినిధులను ఆకర్షించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియా విపరీతంగా విస్తరించిపోయింది. వాటిని దృష్టిలో ఉంచుకుని సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేయడం గమనార్హం. 'ఐ లవ్ ఎస్ఎఫ్ఐ' ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దాంతోపాటు ఉద్యమ స్ఫూర్తిని ప్రతినిధుల్లో ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా భగత్‌సింగ్, చేగువేరా ఫొటోలతో సెల్ఫీ పాయింట్లను సిద్ధం చేశారు. ఆడిటోరియం లోపల మహనీయుల కొటేషన్లతో ఆకట్టుకునేలా ఉంటాయి. ఇక ఓయూలో గుండ్రంగా ఉండే పది పెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. ఆర్ట్స్ కాలేజీ, ఎన్సీసీ గేటు, పోలీస్‌స్టేషన్, లా కాలేజీ వంటి ముఖ్య ప్రాంతాల్లో అవి ఉంటాయి. ఇక ఓయూలో ప్రధాన కూడళ్ల వద్ద ఫ్లెక్సీలు, తోరణాలు, జెండాలుండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న ప్రతినిధుల కోసం ఆయా రాష్ట్రాలకు చెందిన వంటకాలను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ వంటకాలూ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.