Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీయుఎంహెచ్‌ఇయూ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాథమిక కేంద్రాల్లో పని చేస్తున్న పబ్లిక్ హెల్త్ మేనేజర్ల (పీహెచ్ఎం) వేతనాలు పెంచుతూ ఉత్తర్వులివ్వాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్(టీయుఎంహెచ్ ఇయూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఆ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు భూపాల్, అధ్యక్షులు మహ్మద్ ఫసీయొద్దీన్, ప్రధాన కార్యదర్శి కె.యాదానాయక్, కార్యదర్శి వి.విజయవర్థన్ రాజు, ఆరోగ్య మిత్రల నాయకులు గిరి యాదయ్య, పీహెచ్ఎంల నాయకులు వైకుంఠం ఒక ప్రకటన విడుదల చేశారు.
పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న వారికి జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా వేతనాలు పెంచినప్పటికీ పీహెచ్ఎంలను విస్మరించారని తెలిపారు. ఆర్ఓపి 2022-23లో వీరి వేతనం ఆమోదం పొంది నాలుగు నెలలు గడిచాయని చెప్పారు. మిగిలిన వారికి పీఆర్సీ ప్రకారం పెంచి వీరికి పెంచకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 510 జీవోలో కూడా వేతనాలు పెంచలేదని గుర్తుచేశారు. ఇప్పుడేమో ఆర్ఓపీ ఆమోదం పొందినా రూ.18 వేలు చెల్లించడం లేదని పేర్కొన్నారు. వెంటనే వారికి వేతనాలు పెంచి ఎరియర్స్ కూడా చెల్లించాలని కోరారు. సపోర్టింగ్ స్టాఫ్‌కు రూ.10 వేలు ఇస్తున్నారనీ, వారికి 2021 జూన్‌లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందిలో నాలుగో తరగతి క్యాడర్‌కు కనీసం రూ.15,600 నిర్ణయించిన ప్రకారం పెంచాలని విజ్ఞప్తి చేశారు.
కుటుంబాలకు దూరంగా.....తీవ్ర ఇబ్బందుల్లో
కుటుంబాలకు దూరంగా తీవ్ర ఇబ్బందుల్లో పని చేస్తున్న 104 ఉద్యోగులకు బదిలీలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. 104 సర్వీసుల్లో పని చేసిన సిబ్బందిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్నారనీ, ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన నియమించారని గుర్తు చేశారు. మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తూ సొంత జిల్లాలకు బదిలీలు చేయాలని అనేక సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆరోగ్యమిత్రలకు వేతనం రూ.28 వేలకు పెంచాలి
ఆరోగ్యమిత్రల వేతనం రూ.28 వేలకు పెంచా లని వారు డిమాండ్ చేశారు. 15 ఏండ్లుగా ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరోగ్యశ్రీ, ఎంప్లా యీస్ హెల్త్ స్కీమ్, ఆయుష్మాన్ భారత్, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ల 1,400 మంది ఆరోగ్య మిత్రలు ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో పని చేస్తున్నారని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మెరుగైన సేవలందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న వారి కుటుంబాలు తక్కువ జీతాల కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. వీరందరిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోకి మార్చి డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ క్యాడర్ కల్పించాలనీ, ఆరు గంటల పని విధానం, పదోన్నతులు, మరణించిన ఉద్యోగికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా కల్పించాలని కోరారు. సమస్యల పరిష్కారం తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు, కమిషనర్ శ్వేతా మహంతిలకు విజ్ఞప్తి చేశారు.