Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చేది రైతు ప్రభుత్వమే...
- కర్నాటక నుంచే తొలి అడుగు...
- అక్కడి ఎన్నికల్లో జేడీఎస్‌కు మద్దతు
- ఇది దేశానికే వెలుగుదివ్వె
- భారత రాష్ట్ర సమితి ఆవిర్భావాన్ని ప్రకటించిన కేసీఆర్
- తెలంగాణ భవన్లో పతాకావిష్కరణ
- ముఖ్య అతిథులుగా హాజరైన కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి,సినీ నటుడు ప్రకాశ్ రాజ్
- 14న ఢిల్లీలో కేంద్ర కార్యాలయం ప్రారంభం
ఇప్పటి వరకూ దేశాన్ని పాలించిన కేంద్ర పాలకుల వైఫల్యాలను సరిదిద్దుతూ.. దేశ సమగ్రాభివృద్ధి కోసం జాతీయ స్థాయిలో నూతన విధానాలను రూపొందించాలి. వ్యవసాయాధారిత దేశంలో ఆ రంగం రోజురోజుకీ నిర్లక్ష్యానికి గురవుతున్నది. ఈ నేపథ్యంలో నూతన వ్యవసాయ విధానాన్ని రూపొందించటం ద్వారా రైతుల బతుకులను బాగు చేయాలి. దీంతోపాటు విద్య, వైద్య రంగాల అభివృద్ధి, మహిళా సాధికారితే లక్ష్యంగా బీఆర్ఎస్ పని చేస్తుంది. ఇందుకు సంబంధించిన విధివిధానాల రూపకల్పన కోసం విశ్రాంత జడ్జీలు, ప్రముఖ ఆర్థిక, సామాజిక వేత్తలు, మేధావులు కసరత్తులు ప్రారంభించారు.''
- కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వచ్చే ఏడాది రాష్ట్ర ఎన్నికలు.. ఆ తర్వాత నిర్వహించబోయే పార్లమెంటు ఎలక్షన్లను దృష్టిలో ఉంచుకుని జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు వీలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ వడివడిగా అడుగులేస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావాన్ని ఆయన ప్రకటించారు. అనంతరం ఆ పార్టీ పతాకాన్ని కూడా ఆవిష్కరించారు. 'ఆబ్ కీ బార్ కిసాన్ సర్కార్...' (వచ్చేది రైతు ప్రభుత్వమే) అంటూ ఆయన ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రం కర్నాటక నుంచే బీఆర్ఎస్ తన జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తుందని వెల్లడించారు. అక్కడి శాసనసభకు వచ్చే ఏడాదిలో నిర్వహించనున్న ఎన్నికల్లో జేడీఎస్‌కు మద్దతునిస్తామని ప్రకటించారు. ఆ పార్టీ నేత, మాజీ సీఎం కుమారస్వామి మరోసారి ముఖ్యమంత్రి కావాలంటూ ఆకాంక్షించారు. బీఆర్ఎస్ అనేది దేశానికే వెలుగుదివ్వెలాంటిందని కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పారు. దాని కాంతిని దేశమంతటా ప్రసరింపజేయాలని అన్నారు. ఇందుకనుగుణంగా ఈనెల 14న దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఆ రోజు నుంచి పార్టీ జాతీయ కార్యకలాపాలు అక్కడి నుంచే ఆరంభమవుతాయని వివరించారు. ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలంతా ఈనెల 13 సాయంత్రానికి ఢిల్లీ చేరుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. మరో రెండు మూడు నెలల్లో భవనం పనులన్నింటినీ పూర్తి చేసుకుని... అక్కడి నుంచే పూర్తిస్థాయి కార్యకలాపాలను ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం 1.20 గంటలకు బీఆర్ఎస్ ఆవిర్భావాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, సినీ నటుడు ప్రకాశ్ రాజ్‌తోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఏర్పాటు, దాని గెలుపోటములు, ఉద్యమంలో కీలక ఘట్టాలు, ఒడిదుడుకులు, స్వరాష్ట్ర సాధన, ఆ సందర్భంగా ఎదుర్కొన్న అవమానాలు, అవహేళనలు తదితరాంశాలను కేసీఆర్ ఈ సందర్భంగా ఏకరువు పెట్టారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అందిస్తున్న పాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కల్పన, పరిశ్రమల ఏర్పాటు, వ్యవసాయంతోపాటు ఇతర రంగాల్లో సాధించిన వృద్ధి తదితరాంశాలను ఆయన సోదాహరణరంగా వివరించారు. ఇదే సమయంలో దేశంలో అద్భుతమైన జల వనరులు, సాగు భూమి, సమ శీతోష్ణ వాతావరణం ఉన్నాయని సీఎం గుర్తు చేశారు. ఇలాంటి వనరులు, అవకాశాలు ప్రపంచంలోని మరే దేశానికీ లేవని వివరించారు. అయితే ఇక్కడున్న మానవ వనరులను వాడుకోలేకపోవటం వల్ల యువ సంపత్తి నిర్వీర్యమైపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు యువతను మతోన్మాదులుగా మార్చేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని మార్చాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ క్రమంలో భావజాల వ్యాప్తికి శ్రీకారం చుట్టాలనీ, తద్వారా ప్రజల్లో చైతన్యం రగిలించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గ విధానాలకు వ్యతిరేకంగా, నూతన విధానాలను అమల్లోకి తేవాలని సూచించారు.