Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యారంగ సమస్యలపై నిరంతర సమరభేరి
- నూతన విద్యావిధానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం
- విద్యార్థి సంఘ ఎన్నికల్లో గెలుపుబావుటా
- విశ్వవిద్యాలయాల్లో ఎస్ఎఫ్ఐకి ప్రత్యేక గుర్తింపు
- మోడీ సర్కారు అనుసరిస్తున్న విధానాలపైనే మహాసభల్లో చర్చ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలోని విద్యార్థులు, విద్యారంగ సమస్యలపై భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) నిరంతరం సమరభేరి మోగిస్తున్నది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యావ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తున్నది. నూతన జాతీయ విద్యావిధానం-2020కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపట్టింది. పేద విద్యార్థులకు ఎలాంటి నష్టం కలుగుతుందో, మహిళలు విద్యకు ఎలా దూరమవుతారో, డ్రాపౌట్ రేటు ఎలా పెరుగుతుందో విస్తృతంగా ప్రచారం చేసింది. మతతత్వ భావాలను పాఠ్యాంశాల్లో చేర్చుతూ విద్యార్థులకు శాస్త్రీయ విద్యను అందించకుండా చేసిన పద్ధతులను వ్యతిరేకించింది. స్వాతంత్య్రోద్యమానికి సంబంధించిన చరిత్రను వక్రీకరిస్తూ పాఠ్యాంశాల్లో, ఆజాదీకా అమృత మహోత్సవాల పేరుతో నిర్వహించిన కార్యక్రమాల్లో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వాస్తవాలను కప్పిపుచ్చడాన్ని ప్రశ్నించింది. మహాత్మాగాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భగత్‌సింగ్ వంటి స్వాతంత్య్ర సమరయోధుల పాఠ్యాంశాలను తొలగించి హేగ్డేవార్, వీర్‌సావర్కర్ వంటి వారి చరిత్రను చేర్చడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకోవైపు రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, ఫెడరలిజం, లౌకిక పునాదులపై కేంద్రం దాడులు చేసింది. ఇలాంటి ప్రమాదకరమైన అంశాలపై సభలు, ఇష్టాగోష్టులు, సెమినార్లు, రౌండ్‌టేబుల్ సమావేశా లను నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పించింది. వారికి వాస్తవాలను అందించడంతోపాటు శాస్త్రీయ భావజాలాన్ని పెంపొందించేందుకు కృషి చేసింది. అభ్యుదయ, ప్రగతిశీల భావాలున్న ప్రొఫెసర్లు, మేధావులను ఇందులో భాగస్వాములను చేసింది. అందరికీ విద్య.. అందరికీ ఉపాధి కల్పించాలని కోరుతూ దేశవ్యాప్తంగా జాతాలను నిర్వహించింది. దేశంలోని విద్యార్థులందరికీ సమానమైన, నాణ్యమైన విద్యను అందించాలని డిమాండ్ చేసింది. ఇలా విద్యార్థులు, విద్యారంగ సమస్యలపై అవిశ్రాంతంగా కృషి చేస్తున్న 'ఎస్ఎఫ్ఐ' పోరాటాలకు వేగుచుక్కగా నిలిచిందనడంలో సందేహం లేదు.
నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాటం
దేశవ్యాప్తంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది. జేఎన్‌యూలో కన్నయ్యకుమార్, షెల్లా రశీద్, ఉమర్ఖలీద్పై రాజద్రోహం కేసు పెట్టింది. వారిని జైలులో నిర్బంధించింది. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ను తెచ్చింది. వీటికి వ్యతిరేకంగా విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు పెద్దఎత్తున ప్రతిఘటించారు. జేఎన్‌యూ, జామియా మిలియా వంటి విశ్వవిద్యాల యాల్లోని విద్యార్థులపై ఉక్కుపాదం మోపింది. జామియా మిలియా వర్సిటీలో నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఆ పోరాటంలో విద్యార్థులను ఐక్యం చేసి ఎస్ఎఫ్ఐ ముందుభాగంలో నిలబడింది. జేఎన్‌యూలో ఎస్ఎఫ్ఐ నాయకురాలు అయిషీఘోష్పై ఏబీవీపీ మూకలు దాడి చేసి భయభ్రాంతులకు గురిచేశాయి. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, హెచ్‌సీయూ, వారణాసి, పాండిచ్చేరి, కర్నాటక వంటి వర్సిటీల్లోనూ విద్యార్థులపై దాడులు జరిగాయి. ఫీజుల పెంపు, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను ప్రవేశపెట్టడం వంటి విధానాలకు వ్యతిరేకంగా జేఎన్‌యూ విద్యార్థులు ఎస్ఎఫ్ఐ నేతృత్వంలో పెద్దఎత్తున పోరాడారు. ఇలా విద్యారంగం సమస్యలపై నిరంతరం పోరాటం చేయడంతో విశ్వవిద్యాలయాల్లో ఎస్ఎఫ్ఐకి ప్రత్యేక గుర్తింపు లభించింది. దానివల్ల విద్యార్థి సంఘ గుర్తింపు ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ విజయకేతనం ఎగురవేసింది. జేఎన్‌యూ, హెచ్‌సీయూ, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్, కర్నాటక, గుజరాత్, బెంగాల్‌లోని జాదవ్‌పూర్ వంటి విశ్వవిద్యాలయాల్లో ఎస్ఎఫ్ఐ గెలిచింది.
రాజ్యాంగాన్ని రక్షించాలి... ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి : టి నాగరాజు,ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి
ఎస్ఎఫ్ఐ అఖిల భారత 17వ మహాసభల్లో రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ప్రధాన చర్చ ఉంటుంది. విద్యార్థుల హక్కుల కోసం పోరాడాలి. నూతన జాతీయ విద్యావిధానం రద్దు చేయాలని కోరుతూ ఉద్యమించాలి. పేద విద్యార్థులకు నాణ్యమైన చదువులు అందించాలి. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను ఇస్తామన్న మోడీ హామీ అమలుకు నోచుకోలేదు. అందరికీ విద్య.. అందరికీ ఉపాధి కల్పించాల్సిన అవసరమున్నది. మహాసభల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం.