Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎలక్షన్ బాండ్ల పేరిట భారీగా డబ్బు వసూలు
- దేశ ప్రయోజనాల కోసం బీజేపీ వ్యతిరేక శక్తులను ఐక్యం చేయాలి
- మునుగోడు ఎన్నికల తర్వాత కమ్యూనిస్టుల గౌరవం పెరిగింది
- 29 నుంచి జరిగే వ్యకాస రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
గుజరాత్లో మత విభజన పెద్ద ఎత్తున జరిగిందని, దానితోనే బీజేపీ ఈ ఎన్నికల్లో గెలుపొందిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి ఎన్నికల్లో బీజేపీ లబ్దిపొందుతోందని తెలిపారు. ఎలక్షన్ బాండ్ విధానం పేరుతో భారీగా డబ్బు వసూలు చేసి.. వాటినే ఎన్నికల్లో ఖర్చు పెడుతోందని విమర్శించారు. హిమాచల్‌ప్రదేశ్‌లో మతవిద్వేషాలను రెచ్చగొట్టడంలో బీజేపీ పాచికలు పారలేదు కాబట్టే అక్కడ ఓడిపోయిందన్నారు. ఈనెల 29 నుంచి 31వ తేదీ వరకు ఖమ్మంలో నిర్వహించే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాల్సిందిగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాచర్ల భారతి అధ్యక్షతన స్థానిక మంచికంటి మీటింగ్‌హాల్‌లో శుక్రవారం నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తమ్మినేని మాట్లాడారు. మత విభజన జరగకుండా చూడటంతో పాటు బీజేపీ వ్యతిరేక శక్తులను ఐక్యం గా ఉంచడమే ధ్యేయంగా సీపీఐ(ఎం) పనిచేస్తోంద న్నారు. బీజేపీకి దీటుగా ప్రస్తుతం కేసీఆర్ పోరాడు తున్నా ప్రాంతీయ పార్టీలు రాజకీయ అవసరాలకు అనుగుణంగా వ్యవహరిస్తాయనే విషయాన్ని విస్మరించడానికి వీల్లేదన్నారు. రాజ్యాంగ విలువలను నాశనం చేస్తూ, మత విద్వేషాలను రెచ్చగొడుతున్న బీజేపీతో దేశానికి ప్రమాదం పొంచివున్న నేపథ్యంలో ఆ పార్టీ వ్యతిరేక శక్తులను చేరదీస్తున్నట్టు తెలిపారు. దీనిలో భాగంగానే కేసీఆర్‌కు దగ్గరయ్యామన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా నిలబడితేనే కేసీఆర్‌కు మద్దతు ఉంటుందన్నారు. భవిష్యత్తులో పొత్తులు కుదిరే అవకాశం ఉండవచ్చు కానీ ఇప్పటి వరకూ దీనిపై ఏపార్టీతోనూ చర్చలు జరగలేదని చెప్పారు. రాష్ట్రంలో 9 నియోజకవర్గాలపై కేంద్రీకరణ యథా విధిగా కొనసాగుతుందన్నారు. దీనిలో జిల్లాలోనే నాలుగు స్థానాలు ఉన్నాయని చెప్పారు. మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్తో కలిసి బీజేపీని ఓడించడంతో కమ్యూనిస్టుల పట్ల గౌరవం పెరిగిందన్నారు. కేంద్రం విచ్చలవిడిగా ధరలు పెంచుతున్న నేపథ్యంలో గ్రామీణ నిరుపేదలపై విపరీతంగా భారం పడు తోందన్నారు. జిల్లాలో జరిగే వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలకు భారీగా జన సమీకరణ చేసి కేంద్రం విధానాలు, ధరల పెరుగుదలను తిప్పికొట్టా లన్నారు. ఖమ్మంలో జరిగే వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పాలని ఆకాంక్షించారు. పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మహాసభల విజయవంతానికి దిశానిర్దేశం చేశారు. ప్లీనరీ ప్రారంభానికి ముందు పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్యాణం వెంకటేశ్వరరావు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, బుగ్గవీటి సరళ, భూక్యా వీరభద్రం, బండి రమేష్, బొంతు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.