Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమలైతే ఒక్కో మోటార్‌పై నెలకు రూ. 5 వేల బిల్లు !
- విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే రైతుపై పెనుభారం
- రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేస్తున్న కేంద్రం
- ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రూ.808 కోట్ల భారం పడే అవకాశం
- ఆహార ఉత్పత్తుల కొరత తీవ్రరూపం దాల్చనుందని నిపుణుల అంచనా
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ సంస్కరణలు రాష్ట్రంలో అమలైతే ఒక్కో వ్యవసాయ మోటరుపై నెలకు రూ.5వేల బిల్లు చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్ర్రంలో ఇది అమలు చేయనప్పటికీ.. ఖచ్చితంగా అమలు చేయాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తుంది. విద్యుత్ సంస్కరణలపై కేంద్రం చేస్తున్న ఒత్తిడిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టబోమని, దానికి తలొగ్గబోమని చెబుతున్నారు. కేంద్రం విధానాన్ని రాష్ట్రప్రజలందరూ వ్యతిరేకించాలని, అలాంటి వాటిని దీటుగా ఎదిరించాలని పిలుపునిచ్చారు. వామపక్ష పార్టీలు, రైతుసంఘాలు వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగింపు విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. మోటార్లకు మీటర్లు బిగించితే రాష్ట్రంలో వ్యవసాయం కుంటుపడటం ఖాయమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సాగు ఖర్చు పెరిగి, పంటకు గిట్టుబాటు రాక అల్లాడుతున్న రైతులపై కేంద్ర నిర్ణయం 'మూలుగుతున్న నక్కపై తాటి పండు పడ్డ' చందంగా మారే ప్రభావం ఉంది. దీని ప్రభావంతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గి, ఆహార ఉత్పత్తుల కొరత రానుందని నిపుణులు భావిస్తున్నారు.
నెలకు రూ.5వేల బిల్లు..?
కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే ఒక మోటర్‌పై నెలకు సుమారు. రూ.ఐదు వేల బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. వ్యవసాయానికి రైతులు 3 హార్స్ పవర్, 5 హార్స్ పవర్ మోటార్లు వాడుతుంటారు. ఒక 5 హెచ్‌పీ మోటారు ఒక గంట పొలానికి నీళ్లు పెట్టడానికి వాడితే 3.7 యూనిట్ల విద్యుత్ ఖర్చు అవుతుంది. ఇలా రోజుకు సరాసరిన 7 గంటలు ఒక రైతు తన మోటారు నడిపిస్తే 25.9 యూనిట్ల విద్యుత్ ఖర్చు అవుతుంది. ఈ లెక్కన నెలకు ఒక మోటర్‌కు 777 యూనిట్ల విద్యుత్ అవసరం అవుతుంది. ఇందుకు యూనిట్‌కు రూ.6.9 ఛార్జీ చేయగా 777 యూనిట్లకు సుమారు రూ.5,361లు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఏడాదికి సుమారు రూ.60 వేలు చెల్లించాల్సి వస్తోంది. రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మండలంలో 18 వేల కనెక్షన్లు ఉండగా నెలకు 10 లక్షల యూనిట్ల విద్యుత్ ఖర్చు అవుతుంది. ఇందుకు బిల్లు రూ. ఆరు కోట్లు వస్తోంది. ఏడాదికి గాను రూ.36 కోట్ల విద్యుత్ బిల్లును ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. సబ్సిడీలో కోతలు విధిస్తే ఈ ప్రాంత రైతాంగంపై కోట్ల భారం పడనుందని విద్యుత్ శాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
రైతుకు మిగిలేది శూన్యమే
కేంద్రం మోటర్‌కు మీటర్ పేరుతో విద్యుత్ బిల్లు లాక్కొవాలని చూస్తోంది. ఇదే జరిగితే రైతుకు మిగిలేది శూన్యమే. వరి పంట సాగు చేయాలంటే ఒక మోటర్ నడిపిస్తే సుమారు రెండు ఎకరాలు సాగు చేయొచ్చు. రెండు ఎకరాల్లో సాగు చేసిన పంట మంచి దిగుబడి 50 క్వింటాలు వస్తే రూ.లక్ష ఆదాయం వస్తోంది. పంట సాగు ఖర్చులు ఎకరాకు సుమారు రూ.30 వేల చొప్పున రూ.60 ఖర్చు వస్తోంది. ఇది పోగా రైతుకు మిగిలేది రూ.40 వేలు మాత్రమే. ఇది కూడా పంట మంచి దిగుబడి వస్తేనే, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే రైతు సంగతి అంతే. ఇప్పటికే ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ కూలీలు, వ్యవసాయ యంత్రాల కిరాయి, డీజిల్ ధరలతో వ్యవసాయం అగమ్యగోచరంగా తయారైంది. ఇప్పుడు విద్యుత్ ఖర్చులు కూడా రైతు నెత్తిన వేస్తే సంక్షోభంలో ఉన్న వ్యవసాయం రంగం మరింత ఊబిలోకి చేరనుంది. ఇలాంటి రైతు వ్యతిరేక విధానాల వలన వ్యవసాయం చేసే వాళ్లు లేక, ఆహార భద్రతనే ప్రశ్నార్థకంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. కేంద్రం విద్యుత్ సంస్కరణలు రద్దు చేయాల్సిందేనని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
అత్యధిక వ్యవసాయ మోటార్లు ఉన్నది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు లేకపోవడంతో పూర్తి స్థాయిలో విద్యుత్ మోటర్ల వినియోగంతో వ్యవసాయం కొనసాగుతోంది. రాష్ట్రంలో అత్యధికంగా వ్యవసాయ మోటర్లు వాడుతున్న జాబితాలో రంగారెడ్డి జిల్లా మొదటి వరుసలో ఉంది. జిల్లాలో మొత్తం 1,73,817 కనెక్షన్లు ఉన్నాయి. సుమారు ఐదు లక్షల మోటర్లు నడుస్తున్నాయి. ఇందుకు గాను జిల్లాలో ప్రతి నెలా 90 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఖర్చు అవుతుందని విద్యుత్ శాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కన ఏడాదిలో 7,200 మిలియన్ యూనిట్లు విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. ఇందుకు ఛార్జీ చేయాల్సిన బిల్లు రూ.808 కోట్లు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉచిత విద్యుత్ పథకం అమలు అవుతుండటంతో రైతులపై ఎలాంటి భారం లేదు.
మోటర్‌కు మీటర్ రైతుకు శాపం : మధుసూదన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా రైతు సంఘం కార్యదర్శి
సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వ్యవసాయ రంగంపై కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలతో విద్యుత్ బిల్లు భారం మోపాలని చూస్తే రైతుల నడ్డి విరవడమే. ఈ ప్రభావం దేశ ఆహార ఉత్పత్తులపై చూపుతుంది. కేంద్రం తమ ఆనాలోచిత నిర్ణయాలను తక్షణమే ఉపసంహరించుకోవాలి.