Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్మార్ట్ అగ్రి సమ్మిట్ -2022లో మంత్రి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సుస్థిర వ్యవసాయం దిశగా తెలంగాణ పయనిస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రం ఏర్పడే నాటికి కరువు పరిస్థితులు, సాగు, తాగునీటికి ఇబ్బందులు, కరెంటు లేక రైతుల వలసలు పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు వ్యవసాయంలో ఉపాధికి అవకాశం లేని పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ దార్శనికతతో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఓ ప్రముఖ హౌటల్లో 'సాంకేతికతతో కూడిన సుస్థిర వ్యవసాయం' అనే అంశంపై బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన స్మార్ట్ అగ్రి సమ్మిట్- 2022లో మంత్రి మాట్లాడారు. వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ ఈ రంగానికి అవసరమైన సదుపాయాల కల్పనపై దృష్టి సారించారని చెప్పారు. మిషన్‌కాకతీయ కార్యక్రమాలతో భాగంగా చెరువులు, కుంటలకు మరమ్మత్తులు చేపట్టడం ద్వారా భూగర్భజలాలు పెరిగాయని తెలిపారు. దీంతో రెండు కోట్ల 10 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చిందనీ, ఈ ఏడాది వానాకాలంలో వరిసాగు 68 లక్షల ఎకరాలకు చేరుకున్నదని చెప్పారు. మారిన వ్యవసాయ పరిస్థితుల్లో ఎకరా ధర రూ.20 లక్షలకు తక్కువ లేదన్నారు. వ్యవసాయరంగానికి ప్రాధాన్యమిచ్చి జాతి సంపద పెంచేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కేంద్రప్రభుత్వం సహకరించడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సుబీర్చక్రవర్తి, జాతీయ వర్షాధార ప్రాంతాల అభివృద్ధి అథారిటీ, కమిషన్ ఆఫ్ డబులింగ్ ఫార్మర్స్ ఇన్‌కం చైర్మెన్, ఐఏఎస్ అశోక్ దల్వాయి, సచిన్ శర్మ, రామ్ కౌండిన్య (డీజీ ఫెడరేషన్ ఆల్ ఇండియా సీడ్ ఇండిస్టీ) పి.చంద్రశేఖర్ (డీజీ, మేనేజ్) సుశీల చింతల (సీజీఎం, నాబార్డు), టి.నారాయణరెడ్డి (అప్మా అధ్యక్షులు), జయంత చక్రవర్తి (బీసీసీ) తదితరులు పాల్గొన్నారు.