Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీతాలు, సదుపాయాలు నిలిపేస్తాం...
- ఉన్నతాధికారులపై కోర్టు ఆగ్రహం...
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్ నగరంలోని హిల్ ఫోర్ట్ ప్యాలెస్ పునరుద్ధరణలో జాప్యంపై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ హాజరుకాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. కోర్టుకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఆర్థిక, ఆర్అండ్బీ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. సీఎంతో సమీక్ష ఉండటం వల్ల అర్వింద్ కుమార్ హాజరు కాలేకపోయారంటూ ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పారు. గతంలో కూడా ఇదే తరహాలో మరో సాకు చెప్పారంటూ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు సీఎంతో మీటింగ్ అంటున్నారనీ, అధికారులకు అరెస్టుకు వారెంట్ జారీ చేస్తే గానీ కోర్టు ఉత్తర్వులంటే ఏంటో తెలియదంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. తదుపరి విచారణకు సీఎస్‌తోపాటు అర్వింద్ కుమార్ స్వయంగా హాజరుకావాలంటూ ఆదేశించింది. డబ్బులిచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదని, పనుల పురోగతిపై నివేదిక లేకుండా కేసు వాయిదాలు కొనసాగింపు సరికాదని చెప్పింది. కోర్టు ఉత్తర్వులంటే అధికారులకు అంత చులకనగా ఉందా...? అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసి జైలుకు పంపిస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్నతాధికారులకు జీతాలు, సదుపాయాలు నిలిపివేస్తేనే వారిలో కదలికొస్తుందంటూ హెచ్చరించింది. అనంతరం విచారణను ఈనెల 23కి వాయిదా వేసింది.