Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అది ఆయనకు అనుకూలంగా ఉంది...
- సిట్ కేసును సీబీఐకి అప్పగించాలి
- హైకోర్టులో వాదనలు
నవతెలంగాణ - హైదరాబాద్
'ఎమ్మెల్యేల ఎరకు సంబంధించి మొయినాబాద్ ఫాంహౌస్‌లో దాదాపు మూడు గంటలపాటు మంతనాలు జరిగాయంటూ పోలీసులు చెప్పారు.. ఆ మేరకు వీడియాలు కూడా ఉన్నాయంటూ వారు చెప్పారు.. అయితే సీఎం విలేకరుల సమావేశంలో గంట సేపు ఉన్న వీడియోనే రిలీజ్ చేశారు.. అంటే వీడియోను ఎడిట్ చేశారని తెలుస్తోంది...' అందువల్ల ఎమ్మెల్యేల ఎర కేసును కొట్టేయాలంటూ తుషార్ వెల్లపల్లి వేసిన కేసులో సీనియర్ లాయర్ ఎన్డి సంజయ్ వాదించారు. సీఎం కేసీఆర్ నిర్వహించిన మీడియా సమావేశంలో కేసుకు చెందిన సాక్ష్యాల వీడియో, ఆడియో సీడీలను విడుదల చేయడం చట్ట వ్యతిరేకమని ఆయన తెలిపారు. సిట్ పేర్కొన్న అంశాలు, మీడియాకు సీఎం విడుదల చేసిన అంశాలు ఒకే తరహాలో ఉన్నాయంటూ హైకోర్టు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సీఎం ఆ వీడియోలను సీజేఐకి, హైకోర్టు సీజేలకు, ఇతర ప్రముఖులకు పంపించడం ద్వారా రాజకీయంగా లబ్ది పొందేందుకు ప్రయత్నించారని విమర్శించారు. పోలీసులు కూడా దర్యాప్తునకు ముందే విలేకరుల సమావేశంలో కీలక విషయాన్ని వెల్లడించారని చెప్పారు. సిట్ ద్వారా ప్రముఖులను అరెస్టు చేయడమే లక్ష్యంగా సీఎం కుట్ర పన్నారని తెలిపారు. రాజకీయ ప్రయోజనం కోసమే ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారన్నారు. దర్యాప్తు చేయకముందే పోలీస్ అధికారులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం చెల్లదని స్పష్టం చేశారు. దర్యాప్తు ఎలా ఉండాలనే విషయాన్ని కేసీఆర్ తన మీడియా సమావేశం ద్వారా పోలీసులకు విశదీకరించారు. ఆ తర్వాతే తుషార్‌కు సిట్ నోటీసులు ఇచ్చిందని, నిందితుడిగా చేర్చేందుకు వీలుగా మెమో వేసిందన్నారు. మరో సీనియర్ న్యాయవాది మహేష్ జఠ్మలానీ వాదిస్తూ, సీఎం విలేకరులకు వివరాలను వెల్లడించటంపై సిట్ బేషరతుగా హైకోర్టుకు క్షమాపణలు చెప్పిందన్నారు. అయితే పోలీస్ ఆఫీసర్లు విలేకరుల సమావేశంలో చెప్పడాన్ని బట్టి కేసు ఏవిధంగా కొలిక్కి రాబోతోందో తెలుస్తోందన్నారు. అందుకే సిట్ దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ వారిరువురూ కోరారు. ఈ క్రమంలో విచారణను 13కు వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ విజరుసేన్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.