Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముందస్తు రిజర్వేషన్ల సౌకర్యం
- టీఎస్ఆర్టీసీ ఎమ్డీ వీసీ సజ్జనార్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. జనవరి 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయనీ, మొత్తంగా 4,233 అదనపు బస్సులు నడపాలని నిర్ణయించి నట్టు వివరించారు. వీటిలో 585 సర్వీసులకు రిజర్వేషన్ సౌకర్యం ఉన్నదని చెప్పారు. శుక్రవారంనాడాయన హైదరాబాద్ బస్ భవన్ నుంచి ఆర్టీసీ ఉన్నతాధికారులు, ఆర్ఎంలు, డీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గత ఏడాది కన్నా ఈ సంక్రాంతికి 10 శాతం అదనపు బస్సులను నడుపుతున్నామని చెప్పారు. గత ఏడాది 3,736 ప్రత్యేక బస్సులు నడిపామని గుర్తు చేశారు. ఈసారి ఆంధ్రప్రదేశ్లోని అమలాపురం 125, కాకినాడ 117, కందుకూరు 83, విశాఖపట్నం 65, పోలవరం 51, రాజమండ్రి 40 ప్రత్యేక బస్సులను నడుపుతు న్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలు, పట్ణణాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపేలా చర్యలు తీసుకోవాలని ఆర్ఎంలు, డీఎంలకు సూచించారు. సంక్రాంతి సందర్భంగా అడ్వాన్స్ టికెట్ బుకింగ్ తీసుకొనేందుకు 30 రోజుల గడువు ను 60 రోజులకు పొడిగించామన్నారు. ఈ సౌకర్యం వచ్చే ఏడాది జూన్ వరకు అందుబాటులో ఉంటుం దనీ, ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు.